శాతకర్ణిపై పిటిషన్.. కోర్టు తీసుకోలేదు

Wed Jan 11 2017 17:44:45 GMT+0530 (IST)

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించడం.. కొంత వివాదాన్ని రగిలించడమే కాదు.. ఇప్పుడు హైకోర్టు వరకూ కూడా విషయం వచ్చింది. ఈ చిత్రానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడంలో నిబంధనల అతిక్రమణ జరిగిందంటూ.. హైకోర్టులో ఒక పిటిషనర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.

అసలు సినిమాను చరిత్ర ప్రకారమే తీశారా.. లేక సినిమాటిక్ గా ఉండడం కోసం వక్రీకరించారా.. ఎలాంటి అంశాలను చరిత్రకారులతో సంప్రదించకుండానే పన్ను మినహాయింపులు ఎలా ప్రకటిస్తారు అంటూ పిటిషన్ లో ప్రశ్నించడం జరిగింది. అయితే.. హైకోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించలేదు. సినిమా విడుదలకు ముందు రోజున ఇలా పిటిషన్ స్వీకరించడం సబబు కాదని కోర్టు తెలిపింది. అయితే.. ఈ పిటిషన్ ను రెగ్యులర్ బెంచ్ ద్వారా విచారణకు కోరవచ్చని తెలిపింది హైకోర్టు.

ఒకవేళ పిటిషనర్ చెప్పినవన్నీ వాస్తవాలే అయిన పక్షంలో.. సినిమా విడుదల అయ్యాక కూడా.. ఇచ్చిన మినహాయింపును వెనక్కు రాబట్టుకోవచ్చు కదా అన్నది కోర్టు వాదన. అలా హైకోర్టు నుంచి శాతకర్ణికి ఒక ఊరట లభించినట్లే. వివాదం అవుతుందని అనుకుంటే.. అది కేవలం ఒక రెగ్యులర్ కేసుగా మారిపోయి.. చిత్ర విడుదలకు అడ్డం కాలేకపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/