షాక్ అయ్యే విషయాన్ని చెప్పిన హీరోయిన్!

Mon Apr 16 2018 09:53:20 GMT+0530 (IST)

తమకు సంబంధం లేకుండానే తమపై జరిగిన వేధింపుల విషయంలో మహిళలు తమలో తామే కుమిలిపోవటం లేదు. లైంగిక దాడులు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు తెచ్చుకొని మరీ బయటకు చెబుతున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పాఠాలుగా తీసుకొని.. మీ పిల్లల విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలని  కోరుకుంటున్నారు. గతానికి భిన్నంగా దారుణాలపై బయటకు మాట్లాడే తీరు స్వాగతించాల్సిందే.ఇటీవల జమ్ముకశ్మీర్ లో ఎనిమిదేళ్ల చిన్నారిపై నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం జరగటం.. అనంతరం ఆ చిన్నారిని అతి దారుణంగా కొట్టి చంపటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతాన్ని ప్రముఖులంతా తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ఇలాంటివేళ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎదుగుతున్న నివేథా పేతురాజ్.  ఐదేళ్ల చిరు ప్రాయంలో తనకూ ఇదే తరహాలో దారుణం ఎదురైందని చెప్పారు. తానూ అత్యాచార బాధితురాలినేనని ఆమె సంచలన ప్రకటన చేశారు.

తన గురించి ఆమె ఓపెన్ అయి.. తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే అలాంటివి చోటు చేసుకోకుండా అడ్డుకోవచ్చు. అలా అడ్డుకునే వీలున్న అంశాల్లో స్త్రీల రక్షణ. చిన్నతనంలోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ వేధింపుల్ని నేను ఐదేళ్ల వయసులోనే ఎదుర్కొన్నాను. ఆ విషయాన్ని అప్పుడు అమ్మానాన్నలకు ఎలా చెప్పగలను? అని ప్రశ్నించారు.

మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సూచనను ఆమె చేశారు. మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు?  ఎవరు మీ పిల్లలకు దగ్గరగా ఉన్నారు?  వారు ఎలాంటివారు?  లాంటి అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. పిల్లల పెంపకం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. పోలీసుల్ని నమ్మి ఉండలేం. మీ వీధిలో కుర్రాళ్లపైన ఒక కన్నేసి ఉండాలి. ఏమైనా తప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి. అత్యాచార చర్యలు చాలా బాధాకరం.. ఇలాంటి వాటిని అణిచివేస్తేనే ప్రశాంతంగా జీవిస్తాం అని వ్యాఖ్యానించారు. హీరోయిన్ ఇమేజ్ ఉండి కూడా ఇంతగా ఓపెన్ అయిన నివేథాను అభినందించాల్సిందే.