విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తండ్రే అడ్డంకా..?

Sat Mar 25 2017 13:21:04 GMT+0530 (IST)

ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత తమిళనాడు ప్రజలను అన్నా డీఎంకే పార్టీనే వదిలివెళ్లడం కాదు.. ఏకంగా తమిళనాడు రాజకీయాల్లోనే ఒక శూన్యతను మిగిల్చారు. ఆమెకు రాజకీయ సరిజోడు అయిన కరుణానిధి అనారోగ్యంతో ఉండడం వల్ల తమిళనాడులో నెక్స్టు ఎవరన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఎందరో ప్రయత్నాలు చేస్తున్నా వారెవరూ అమ్మ జయలలిత ఛరిష్మాకు సరితూగేవారే కారు. ఈ పరిస్థితుల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తే అమ్మ స్థానం భర్తీ అవుతుందన్న భావన అంతటా వ్యక్తమవుతున్నా దానిపైనా ఇంతవరకు స్పష్టత లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ పై కోట్లాదిమందికి ఆశలున్నా ఆయన అడుగుల్లో ఆ వేడి కనిపించడం లేదు.. ఆయన నిర్ణయాలూ ఆ దిశగా లేవు. దీంతో విజయే దిక్కన్న భావన వ్యక్తమవుతోంది.

అమ్మ మరణం తరువాత ఏర్పడిన రాజకీయ ఖాళీని నింపేదెవరా అని తమిళ జనం అక్కడి సినీ తారల వైపు చూస్తున్నారు. జయలలిత కరుణానిధి వంటి వారు సినిమా నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో పాగా వేసినవారే కాబట్టి.. అక్కడి ప్రజలంతా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా ఆయన రజనీ మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతూనే ఉన్నారు.  అమ్మ ఆశీర్వాదం ఉన్న అజిత్ కూడా తన మనసేంటో చెప్పడం లేదు. అదే సమయంలో రజనీ తర్వాత తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సైతం పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ప్రయత్నించి విజయ్ వెనక్కి తగ్గారు. ప్రస్తుత తమిళ రాజకీయాల్లో ఒక అనిశ్చితి నెలకొనడంతో విజయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు అక్కడి జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. విజయ్ తండ్రి సీనియర్ దర్శకుడు అయిన చంద్రశేఖర్ గతంలో దీనిపై ఆసక్తి చూపినా ఇప్పుడు ఆయన కూడా అయోమయ సమాధానాలే చెబుతున్నారు. పదేళ్ల క్రితం విజయ్ రాజకీయాల్లోకి రావాలని తాను ఆకాంక్షించానని కానీ ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి నెలకొందని చంద్రశేఖర్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ జరగకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

అయితే... రాజకీయాల్లోకి రావాలని విజయ్ మనసులో బలంగా ఉందని.. కానీ తండ్రి సూచనలు పాటిస్తూ వేచిచూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. అక్కడ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టాలా... ఉన్న పార్టీల్లోకి వెళ్లాలా... లేదంటే తమిళనాడులో పాగా వేయాలని తహతహలాడుతున్న మోడీ పంచన చేరి తమిళనాట బీజేపీకి తురుపుముక్క కావాలా అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అదేసమయంలో మిగతా స్టార్లు రజనీ అజిత్ లు వేసే స్టెప్టులు చూసి తాను నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. విజయ్ కాంత్ అనుభవాలనూ మననం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో విజయ్ స్వయంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని.. ఆయనలో దూకుడు ఉన్నా తండ్రి అడ్డుకట్ట వేస్తున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/