సూర్యను కదిలించిన యాత్ర

Mon Feb 11 2019 15:59:47 GMT+0530 (IST)

మొదటి రెండు రోజులు సైలెంట్ గా ఉన్నా యాత్ర సినిమాకు సంబంధించి సెలెబ్రిటీలు ఒక్కొక్కరు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇందులో పక్క రాష్ట్రం స్టార్లు కూడా ఉండటం విశేషం. హీరో సూర్య తన ట్విట్టర్ ద్వారా యాత్రతో పాటు దాని కన్నా వారం ముందు విడుదలైన మమ్ముట్టి తమిళ సినిమా పెరంబు గురించి ట్వీట్ చేస్తూ మమ్ముట్టి నటనను యాత్రలో ఓ విజనరీ లీడర్ ప్రయాణాన్ని సమర్దవంతంగా చూపించిన దర్శకుడు మహి రాఘవ పనితనం గురించి ప్రత్యేకంగా పొగడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.యాత్ర షూటింగ్ లో ఉన్నప్పుడే సూర్య ఇందులో జగన్ పాత్రలో కనిపించవచ్చనే టాక్ బలంగా వినిపించింది. అయితే దర్శకుడు రాఘవ అసలు జగన్ పాత్ర సినిమాలో ఎక్కడా ఉండదని అందుకే ఆర్టిస్టు గురించి ఆలోచించాల్సిన పని పడలేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో వాటికి చెక్ పడిపోయింది. ఇప్పుడు సూర్య ప్రత్యేకంగా ట్వీట్ చేయడం చూస్తే మమ్ముట్టితో పాటు వైఎస్ఆర్ మీద అభిమానం బయటపెట్టుకున్నాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాజిటివ్ టాక్ తో స్టడీ కలెక్షన్స్ తో యాత్ర సాఫీగా రన్ అవుతోంది. సూర్యతో పాటు సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం యాత్ర గురించి మెచ్చుకుంటూ తాను ఎంత ఎమోషనల్ అయ్యాడో వివరించే ప్రయత్నం చేసాడు. గాయకుడు సంగీత దర్శకుడు రఘు కుంచె తన ఫేస్ బుక్ లో ప్రత్యేకంగా యాత్ర గురించి ప్రస్తావించాడు. వైఎస్ఆర్ అభిమానులను కాని వాళ్ళను కూడా యాత్ర మెప్పించడమే విజయ రహస్యమని చెప్పొచ్చు. ఇప్పుడు సూర్య లాంటి వాళ్ళు సైతం కాంప్లిమెంట్స్ అందించడంతో తమిళ్ మలయాళం వెర్షన్స్ లో దీని ప్రభావం పడే అవకాశం ఉంది