Begin typing your search above and press return to search.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గేటు దూకిన స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:37 AM GMT
రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గేటు దూకిన స్టార్ హీరో!
X
ఒక స్టార్ హీరో గేటు దూకేయ‌ట‌మా? వెండితెర మీద ఎంత హుషారుగా వ్య‌వ‌హ‌రిస్తాడో.. అంతే హుషారుతో అంద‌రికి షాకివ్వ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాడు. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రంటారా? త‌మిళ‌హీరో సూర్య‌నే. ఈ త‌మిళ స్టార్ హీరోకి రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గేటు దూకాల్సిన అవ‌స‌రం ఏమిటంటారా? కాస్త వివ‌రంగా చ‌దివితే విష‌యం అర్థ‌మైపోతుంది.

సంక్రాంతి రేసులో గ్యాంగ్ చిత్రంతో దూసుకొచ్చిన సూర్య‌.. ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ మొద‌లెట్టేశాడు. ఆశించినంత విజ‌యం ల‌భించ‌న‌ప్ప‌టికీ.. ఏ మాత్రం నిరాశ చెంద‌కుండా త‌న వంతు ప్ర‌య‌త్నంగా ఆయ‌న ప్ర‌మోష‌న్ లో భాగంగా థియేట‌ర్లకు వ‌స్తున్నారు. తాజాగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి వ‌చ్చారు.

త‌న మూవీ ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్‌కు వ‌చ్చారు. అభిమానుల‌కు థ్యాంక్స్ చెప్పారు. సినిమా గురించి మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సూర్య త‌మ ఊరికి వ‌చ్చాడ‌న్న విష‌యం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో.. థియేట‌ర్లో విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకొన్న సూర్య‌.. బ‌య‌ట భారీ ఎత్తున అభిమానులు ఉండ‌టంతో ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

థియేట‌ర్ వెనుక‌న ఉన్న గేటును దూకేసి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ముందు గేటు నుంచి వ‌చ్చిన సూర్య‌.. వెళ్లేట‌ప్పుడు వెనుక గేటు నుంచి వెళ‌తార‌న్న విష‌యం తెలియ‌క‌పోవ‌టంతో గేటు ఓపెన్ చేసి ఉంచ‌లేదు. అయినా.. ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా చ‌లాకీ చిన్న‌డి మాదిరి.. గ‌బ‌గ‌బా గేటు ఎక్కేయ‌ట‌మే కాదు.. కింద‌కు దూకేసి.. త‌న వాహ‌నంలో వెళ్లిపోయారు. సూర్య లాంటోడు గేటు దూకుతుంటే అక్క‌డున్న వారు ఊరుకుంటారా? వెంట‌నే చేతిలో ఉన్న ఫోన్ కెమేరాల‌కు ప‌ని చెప్పారు. గేటు దూకిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటున్నాయి.