రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు!

Sat Apr 21 2018 10:45:06 GMT+0530 (IST)

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలుశిక్షను విధించింది న్యాయస్థానం. యంగ్ అండ్ ఎనర్జటిక్ గా ఉండటం..పక్కింటి కుర్రాడిలా కనిపించే రాజ్ తరుణ్ తనదైన నటనతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించటంతో పాటు.. తనతో సినిమా మినిమం గ్యారెంటీ అన్న పరిస్థితి తెచ్చుకున్నాడు.ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న రాజ్ తరుణ్ కు శరాఘాతంగా కోర్టు తీర్పు మారినట్లుగా చెబుతున్నారు. మోసం కేసులో రాజ్ తరుణ్ తండ్రికి న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానాను విధించారు.

బ్యాంక్ ఉద్యోగి అయిన రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు తాజా శిక్ష విధించింది. విశాఖపట్నంలోని వేపగుంటకు చెందిన బసవరాజు ఎస్ బీఐ సింహాచలం బ్రాంచ్ లో అసిస్టెంట్ క్యాషియర్ గా పని చేస్తుండేవారు. 2013లో తన భార్య రాజ్యలక్ష్మి పేరుతో పాటు మరో ఇద్దరు పేర్లతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.9.85లక్షల లోన్ తీసుకున్నారు.

తాకట్టు తీసుకునే వరకూ బాగానే జరిగినా.. బ్యాంక్ ఉన్నతాధికారుల తనిఖీల్లో బసవరాజు పెట్టిన బంగారం నకిలీదిగా తేలింది. దీంతో.. బ్రాంచ్ మేనేజర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడించారు. నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టిన మోసానికి రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు.. రూ.20వేల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చారు.