నితిన్.. రాముడు మంచి బాలుడు

Wed Jun 12 2019 15:59:45 GMT+0530 (IST)

యువ కథానాయకుడు నితిన్ చివరి సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ విడుదలై ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో అతను ఖాళీగా ఉండిపోయాడు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలే ఇంత గ్యాప్ తీసుకోవట్లేదు. అలాంటిది ఎప్పుడూ తీరిక లేకుండా సినిమాల్లో నటించే నితిన్ ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అలాగని అతడి కొత్త సినిమా ఏదీ ఖరారు కాలేదా అంటే అదేమీ లేదు. పోయినేడాది ఆరంభంలో ‘ఛలో’తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో అతడి సినిమా ఎప్పుడో ఖరారైంది. ఆ సినిమా టైటిల్ ‘భీష్మ’ అని కూడా గత ఏడాదే వెల్లడైంది. ఐతే కారణాలేంటో కానీ.. ఈ చిత్రం పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. ఇదిగో అదిగో అంటూనే నెలలకు నెలలు గడిపేశాడు. ఐతే ఎట్టకేలకు ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. బుధవారం ఉదయమే ‘భీష్మ’ ముహూర్త కార్యక్రమం జరిపారు.ఐతే ఈ వేడుకకు హాజరైన నితిన్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి లుక్ మారిపోయింది. ఎప్పుడూ ట్రెండీ హేర్ స్టైల్ లుక్స్ తో కనిపించే నితిన్.. ప్రారంభోత్సవంలో రాముడు మంచి బాలుడు తరహాలో తయారై వచ్చాడు. హేర్ స్టైల్ 80లు 90ల్లో మాదిరి ఉంది. నితిన్‌ను చూస్తుంటే ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేసిన మురళీ మోహన్ ను చూసినట్లుందని నెటిజన్లు కొందరు కామెంట్ చేయడం గమనార్హం. ఐతే ఈ లుక్ సినిమా కోసం సెట్ చేసుకున్నదా.. లేక క్యాజువల్ గా నితిన్ అలా తయారై వచ్చాడా అన్నది తెలియడం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదే సంస్థ నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా నిర్మించనుండటం విశేషం. ‘భీష్మ’లో నితిన్ సరసన రష్మిక మంధాన నటిస్తోంది.