Begin typing your search above and press return to search.

మీ సపోర్ట్ కావాలి అంటున్న హీరో నిఖిల్

By:  Tupaki Desk   |   25 April 2019 10:21 AM GMT
మీ సపోర్ట్ కావాలి అంటున్న హీరో నిఖిల్
X
యువ హీరో నిఖిల్ తాజా చిత్రం 'అర్జున్ సురవరం' రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజుల నుండి కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాను రెండు సార్లు వాయిదా వేసిన నిర్మాతలు మరోసారి తాజాగా వాయిదా వేశారని.. మే 1 న సినిమా రిలీజ్ కావడంలేదని ఉదయాన్నే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన హీరో నిఖిల్.. ఈ సినిమాకోసం వెయిట్ చేయించినందుకు అభిమానులను క్షమాపణలు కోరాడు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'అర్జున్ సురవరం' విడుదల గురించి నేను ఇలా ఫీల్ అయ్యాను అంటూ ఒక లెటర్ పోస్ట్ చేశాడు. ఒక సంవత్సరం తర్వాత ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు మే 1 న రావాలని అనుకున్నామని కానీ 'అవెంజర్స్' రూపంలో ఎదురుదెబ్బ తగిలిందని తెలిపాడు. ఈ సినిమాను నమ్మి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు విడుదలను వాయిదా వేస్తున్నామని చెప్పాడు. ఇలా సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేయడం బాధాకరమే కానీ డబ్బు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో వారి నిర్ణయాన్ని గౌరవించి రిలీజును వాయిదా వేయక తప్పలేదని అన్నాడు. కొత్త రిలీజ్ డేట్ కోసం నేనుకూడా మీలాగే ఎదురు చూస్తున్నానని.. ఈ సమయంలో మీ సపోర్ట్ కావాలని తెలిపాడు.

ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లయిన ఏషియన్ సినిమాస్ వారు కూడా 'అర్జున్ సురవరం వాయిదాకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. "అర్జున్ సురవరం సినిమా రెడీగా ఉంది. సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ సాధించింది. ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో మేము థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాం. కానీ ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు డీసెంట్ గా కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. మరోవైపు 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాకు క్రేజ్ అసాధారణంగా ఉంది. దీంతో స్క్రీన్స్ దొరకడం కష్టం.. ముఖ్యంగా మల్టిప్లెక్సులలో స్క్రీన్స్ లభించడం కష్టం. అందుకే మేము నిర్మాతలను.. హీరోను.. ఫిలిం యూనిట్ వారిని సినిమా వాయిదా వేయాల్సిందిగా కోరాము. వారు మా అభ్యర్ధనను మన్నించి సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాను 'మహర్షి' రిలీజ్ అయిన తర్వాత ఒక అనువైన డేట్ చూసి విడుదల చేస్తాం" అని తెలిపారు.

ఈ ప్రెస్ నోట్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసిన నిఖిల్ "సినిమాను వాయిదావేయడం నాకు బాధగా ఉంది కానీ సినిమాపై డబ్బు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లను గౌరవించాలి. అందుకే వాయిదా వేస్తున్నాం. సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు అందరికీ క్షమాపణలు" అని మెసేజ్ పెట్టాడు.