Begin typing your search above and press return to search.

నానికోసం ఎవ‌ర్ని త‌ప్పించారు మ‌రి?

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:02 PM GMT
నానికోసం ఎవ‌ర్ని త‌ప్పించారు మ‌రి?
X
టాలీవుడ్‌లో లేటెస్ట్ బ‌జ్... మ‌ణిర‌త్నం సినిమాలో నాని న‌టిస్తున్నాడ‌న్న‌ది. `ఓకే బంగారం`తో హిట్టు కొట్టాక మ‌ణి మ‌ళ్లీ ఓ ప్రేమ‌క‌థ‌కి ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. కాక‌పోతే ఈసారి సినిమాలో ఇద్ద‌రు హీరోలు, ఇద్ద‌రు హీరోయిన్ల‌తో సినిమా అనుకొన్నాడు. రెండు భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఆ సినిమాకోసం న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ కూడా ఎప్పట్నుంచో సాగుతోంది. కార్తీ, దుల్క‌ర్ స‌ల్మాన్ క‌థానాయ‌కులుగా న‌టిస్తార‌ని కొంత‌కాలంగా కోలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. త్రిష‌, నిత్య‌మేన‌న్ క‌థానాయిక‌లుగా ప్ర‌చారంలో ఉన్నారు. కాకపోతే హీరోహీరోయిన్లు ఫిక్స‌య్యాక కూడా ఆ ప్రాజెక్టులో ఎలాంటి క‌ద‌లిక లేదు. మ‌ణి స్క్రిప్టు కి తుది మెరుగులు దిద్దుతున్నాడేమో అని అంతా ఊహిస్తున్నారు. అయితే తాజాగా ఆ ప్రాజెక్టులోకి నాని ఎంట‌ర‌య్యాడ‌న్న వార్త చ‌ర్చ‌ను లేవ‌నెత్తింది. మ‌రి నాని ఎంట‌ర్ అయితే అప్ప‌టికే ఎంపికైన కార్తీ, దుల్క‌ర్‌ల ప‌రిస్థితేంటి? వీరిద్ద‌రిలో ఎవ‌రు బ‌య‌టికి వెళతారు? అనే విష‌యం గురించి ర‌క‌ర‌కాలు మాట్లాడుకొంటున్నారు. కొద్దిమంది మాత్రం నానిని సోలో హీరోగా పెట్టి మ‌ణి సినిమా తీస్తున్నాడ‌ని అంటున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి స‌మాచారం అంద‌డం లేదు. సోలో హీరోగానైనా, లేదంటే మ‌రో హీరోతో క‌లిసి చేసినా మ‌ణి సినిమాలో నాని ఛాన్సు కొట్టాడంటే మాత్రం న‌క్క‌తోక తొక్కిన‌ట్టే అనుకోవాలి. మ‌ణిర‌త్నంకి నాని ఓ పెద్ద ఫ్యాన్‌. ఆయ‌న సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఇక నానికి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. `ఓకే బంగారం`లో దుల్క‌ర్ పాత్ర‌కి నాని తెలుగులో డ‌బ్బింగ్ చెప్పాడు. ఆ అవ‌కాశం వ‌చ్చినందుకే నాని ఎగిరి గంతేశాడు. ఇక ఏకంగా హీరోగా అవ‌కాశం వ‌చ్చిందంటే ఆయ‌న ఆనందానికి అవ‌ధులేముంటాయి?!