గోపిచంద్ కి ప్రమాదం.. అతడు క్షేమమే !

Mon Feb 18 2019 13:17:34 GMT+0530 (IST)

టాలీవుడ్ ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ కి ప్రమాదం జరిగిందా? అంటే అవుననే కొద్ది సేపటి క్రితం ఓ వార్త వెలువడింది. దీంతో గోపిచంద్ కి ఏమైంది?  అంటూ అభిమానుల్లో చర్చ సాగింది. ``రాజస్థాన్ లోని సినిమా షూటింగ్ లో ఉండగా ప్రమాదవశాత్తు గోపి చంద్ కింద పడ్డారు. ఫైట్ సీన్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి చిత్ర బృందం తరలించింది`` అంటూ ప్రచారం సాగింది. అయితే ఇందులో వాస్తవం ఎంత? అన్నదానిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.తాజా సమాచారం ప్రకారం.. గోపిచంద్ పై ఓ బైక్ ఛేజ్ దృశ్యం చిత్రీకరిస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. బైక్ పై స్కిడ్ అవ్వడంతో గోపిచంద్ కింద పడ్డారు. ఆ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స సాగుతోంది. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని చికిత్స అనంతరం షూటింగ్ లో పాల్గొనవచ్చని వైద్యులు తెలిపారని ప్రముఖ పీఆర్ వో బీఏ రాజు ధృవీకరించారు. ఆ మేరకు సామాజిక మాధ్యమాల్లో వివరాలు వెల్లడించారు.

గోపిచంద్ గత కొంతకాలంగా ప్రస్తుత సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. లౌక్యం తర్వాత మళ్లీ మరో బ్లాక్ బస్టర్ ని కళ్ల జూడాలన్న పంతం అతడిలో కనిపిస్తోంది. ఆ క్రమంలోనే కశ్మీర్ నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమాని హిమాలయాల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోందట. గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వం లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో వేగంగా పూర్తవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో గోపీచంద్ ప్రత్యేకించి మార్షల్ ఆర్ట్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది.