ధనుష్ అస్సలు ఒప్పుకోవడం లేదట!

Mon Dec 17 2018 11:45:29 GMT+0530 (IST)

తమిళ హీరోలు పలువురు తెలుగు లో స్టార్ స్టేటస్ ను కలిగి ఉన్నారు. అయితే ధనుష్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఆయన నటించిన ‘రఘువరణ్’ మూవీ తప్ప ఏది కూడా తెలుగు లో పెద్దగా ఆడలేదు. అయినా కూడా తెలుగులో ఆయన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఒక వైపు తమిళంలో సూపర్ స్టార్ క్రేజ్ ను దక్కించుకుంటున్న ధనుష్ తెలుగు లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేక పోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తెలుగు లో ఈయనకు పెద్ద గా మార్కెట్ లేక పోవడంతో ఈయన సినిమాలు చాలా తక్కువ రేటుకు ఇక్కడ అమ్ముడు పోతున్నాయి. ధనుష్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం అయిన ‘మారి’ చిత్రం కు సీక్వెల్ వచ్చింది. ‘మారి 2’ను తమిళంతో పాటు తెలుగులో ఈనెల 21న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలుగులో డిసెంబర్ 21న పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘మారి 2’ చిత్రాన్ని ఒక వారం ఆలస్యంగా విడుదల చేయాలని తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారట. కాని ధనుష్ మాత్రం ఏది ఏమైనా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నాడట. అంతరిక్షం పడి పడి లేచే మనసు చిత్రాల పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఆ సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరికాయి. ‘మారి 2’ సినిమాకు అంతగా థియేటర్లు దొరకడం లేదని కూడా కొందరు అంటున్నారు.

‘మారి 2’ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందట. సాయి పల్లవి వల్ల తెలుగులో మంచి వసూళ్లు నమోదు అవుతాయని ధనుష్ అండ్ టీం భావిస్తున్నారు. తెలుగులో సాయి పల్లవికి మంచి ఇమేజ్ ఉంది. అయితే ఆమె నటించిన పడి పడి లేచే మనసు మరియు మారి 2 చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు ఎటు మొగ్గుతారో చూడాలి. ఒకే రోజు ఇన్ని సినిమాలు విడుదలైతే ఖచ్చితంగా దేనికో ఒకదానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సినిమా ఏదో చూడాలి.