మహేష్ ఓపికకు హ్యాట్సాఫ్

Sat Aug 12 2017 13:18:44 GMT+0530 (IST)

మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’లో ఎస్.జె.సూర్య మెయిన్ విలన్ అన్న సంగతి తెలిసిందే. మొన్న రిలీజైన టీజర్లో ఎస్.జె.సూర్య కనిపించాడు కూడా. అతడి పాత్రకు సంబంధించిన ఐడియా కూడా ప్రేక్షకులకు వచ్చేసింది. ఐతే ఈ చిత్రంలో ఇంకో విలన్ కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. అతను కూడా తమిళుడే. ‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో.. తొలిసారిగా తన కెరీర్లో విలన్ పాత్ర.. అది కూడా తెలుగు సినిమాలో చేస్తుండటం విశేషం. ఈ సినిమా తనకు ప్రత్యేకమైన అనుభవమని.. ఈ ఒక్క సినిమాలో మాత్రమే తాను విలన్ పాత్ర చేస్తున్నానని.. ఇకపై విలన్ గా నటించే అవకాశం లేదని భరత్ చెప్పడం విశేషం.

మహేష్ బాబుకు ఎంత ఓపిక ఉందో ‘స్పైడర్’ షూటింగ్ సందర్భంగా చూశానని.. ద్విభాషా చిత్రం కావడంతో ప్రతి సన్నివేశం రెండుసార్లు చేయాల్సి వచ్చేదని.. అలాగే చాలా టేక్స్ తీసుకునే వాళ్లమని.. అయినప్పటికీ మహేష్ చాలా ఓపిగ్గా ఎదురు చూసేవాడని అన్నాడు భరత్. ముఖ్యంగా తనకు తెలుగు తెలియకపోవడం వల్ల తాను డైలాగులు చెప్పడంలో చాలా ఇబ్బంది పడ్డపుడు మహేష్ ఓపిగ్గా ఉండేవాడని.. తనకెంతో సహకారం అందించాడని చెప్పాడు. మురుగదాస్ తనకు ‘స్పైడర్’ కథ.. తన పాత్ర గురించి చెప్పగానే తాను మరో ఆలోచన లేకుండా తాను ఈ సినిమా ఒప్పుకున్నానని భరత్ తెలిపాడు. ‘ప్రేమిస్తే’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నప్పటికీ.. ఇలా డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని భరత్ చెప్పాడు. తనకు.. మహేష్ కు మధ్య వచ్చే సన్నివేశాల్ని 25 రోజుల పాటు చిత్రీకరించినట్లు భరత్ తెలిపాడు. ఇకపై తాను విలన్ వేషాలు వేయాలనుకోవట్లేదని అతను స్పష్టం చేశాడు.