హేమమాలిని.. క్రిష్ కు అలా షాకిచ్చింది

Thu Jan 12 2017 09:26:09 GMT+0530 (IST)

గౌతమీపుత్ర శాతకర్ణి.. ఈ టైటిల్ చూస్తేనే సినిమాలో శాతకర్ణి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో.. ఆయన తల్లి అయిన గౌతమి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉందన్న సంగతి అర్థమైపోతుంది. ఐతే అంత కీలకమైన పాత్రను ఎవరు చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తెలుగులో ఉన్న సీనియర్ నటీమణులు ఒక్కొక్కరిగా తలుచుకుని చూశారు. కానీ క్రిష్ వీళ్లెవ్వరూ కాదని.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలిని గౌతమి పాత్రకు ఎంచుకుని ఆశ్చర్యపరిచారు. క్రిష్ అడిగితే అడిగాడు కానీ.. హేమమాలిని ఈ పాత్రకు ఒప్పుకోవడం ఆశ్చర్యమే. మరి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లోకి హేమమాలిని ఎలా వచ్చింది అన్న సంగతి క్రిష్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘గౌతమీపుత్ర శాతకర్ణి కథను బాలయ్యకు చెప్పే సమయానికి తల్లి పాత్ర ఎవరన్నది నాకే క్లారిటీ లేదు. హీరోయిన్ పాత్రకు శ్రియను అనుకున్నాను కానీ.. తల్లి పాత్ర గురించే ఏమీ అనుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ పాత్రకు హేమమాలినిని అనుకుంటున్నట్లు బాలయ్యకు చెప్పాను. ఆయన సరే అన్నారు. హిందీలో ‘గబ్బర్’ సినిమా చేసిన పరిచయంతో అక్షయ్ కుమార్ ద్వారా హేమమాలినిని మీటయ్యే అవకాశం సంపాదించాను. కథ చెప్పాక ఆమె తన నిర్ణయం తర్వాత చెబుతానన్నారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే.. తన నిర్ణయమేంటో చెప్పకుండా గౌతమి బాలశ్రీ గురించి.. శాతకర్ణి గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకు తెలియని విషయాలు కూడా ఆమె చెప్పారు. నేను షాకయ్యాను. ఆ గ్యాప్ లో గౌతమి గురించి.. శాతకర్ణి గురించి హేమమాలిని అంతగా పరిశోధన చేశారు. తన పాత్ర విషయంలో ఆమెకున్న డెడికేషన్ అది’’ అని క్రిష్ వివరించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/