Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : హలో గురూ ప్రేమ కోసమే

By:  Tupaki Desk   |   18 Oct 2018 9:03 AM GMT
మూవీ రివ్యూ : హలో గురూ ప్రేమ కోసమే
X
‘హలో గురూ ప్రేమ కోసమే’ రివ్యూ
నటీనటులు: రామ్-అనుపమ పరమేశ్వరన్-ప్రకాష్ రాజ్-ప్రణీత-ఆమని-సితార-జయప్రకాష్-పోసాని కృష్ణమురళ-ప్రవీణ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: విజయ్.కె.చక్రవర్తి
కథ-మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
స్క్రీన్ ప్లే: త్రినాథ రావు నక్కిన-ప్రసన్న కుమార్ బెజవాడ
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్-లక్ష్మణ్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రయాణం ఈ మధ్య అంత సాఫీగా సాగట్లేదు. ఆయనకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరోవైపు హీరో రామ్ కూడా 'ఉన్నది ఒకటే జిందగీ' తో నిరాశ చెందాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పరిస్థితీ అంతంతమాత్రమే. వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ’.. ‘నేను లోకల్’ లాంటి చిత్రాలతో సత్తా చాటుకున్న త్రినాథరావు నక్కిన రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: సంజయ్ (రామ్) కాకినాడలో సరదాగా స్నేహితులతో కలిసి తిరిగేస్తున్న కుర్రాడు. ఐతే తనకిష్టం లేకపోయినా తండ్రి కోరిక మేరకు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడానికి వెళ్తాడు. అక్కడ తన తల్లి స్నేహితుడైన విశ్వనాథం (ప్రకాష్ రాజ్) ఇంట్లోనే అతను ఉంటాడు. విశ్వనాథం కూతురైన అను (అనుపమ పరమేశ్వరన్)తో అతను తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు. కానీ విశ్వనాథం ఆమె మరో పెళ్లి ఖాయం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో అనును దక్కించుకోవడానికి సంజయ్ ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘హలో గురూ ప్రేమ కోసమే’ ట్రైలర్ చూస్తే కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ ఉండదని అర్థమైపోయింది. హీరో రామ్ సైతం ఈ విషయంలో ప్రేక్షకుల్ని ముందే ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు. నిజమే.. ఇందులో కథ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలాసార్లు చూసిన తరహాలోనే ఒక ఫార్మాట్లో సాగిపోయే కథ ఇది. ప్రథమార్ధంలో సరదా సన్నివేశాలు.. రొమాంటిక్ ట్రాక్.. ద్వితీయార్ధంలో హీరోకు-హీరోయిన్ తండ్రికి మధ్య ఒక ఛాలెంజ్.. హీరో తనదైన శైలిలో హీరోయిన్ తో పాటు హీరోయిన్ తండ్రిలోనూ ‘మార్పు’ తెచ్చేయగానే కథ సుఖాంతం.. ఇలా అంతా కూడా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లుగా సాగిపోయే సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’. ఐతే ‘సినిమా చూపిస్త మావ’.. ‘నేను లోకల్’ లాంటి సినిమాల్లో తెలిసిన కథల్నే వినోదాత్మకంగా చెప్పడం ద్వారా ప్రేక్షకుల మనసులు గెలిచిన త్రినాథరావు నక్కిన-ప్రసన్న కుమార్ బెజవాడ.. మరోసారి తమ స్టయిల్లో వెళ్లిపోయారు. ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకుండా చూసుకున్నారు. మొత్తంగా ‘హలో గురూ ప్రేమ కోసమే’ టైంపాస్ అయితే చేయించేస్తుంది. అంతకుమించి దీన్నుంచి ఎక్కువ ఆశించలేం.

హీరో తన ఆఫీసులో ఓ అమ్మాయిని ప్రేమించాలని ఫిక్సవుతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడి ప్రయత్నం ఫలించి తీరా ఆ అమ్మాయి ఇతడికి ప్రపోజ్ చేస్తూ ఆమె ఫీలింగ్స్ చెబుతుంటే.. సరిగ్గా నాకు ఇంకో అమ్మాయి మీద ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయంటూ ఆమె దగ్గరికి పరుగెడతాడు హీరో. అంటే తాను లవ్ చేస్తున్నట్లుగా భావిస్తున్న అమ్మాయి తన ఫీలింగ్స్ చెప్పే వరకు అతడికి హీరోయిన్ మీద ఉన్న ప్రేమ తెలియదట. ఏం లాజిక్కో ఇది. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ‘హలో గురూ ప్రేమ కోసమే’లో లాజిక్ తో సంబంధం లేని విషయాలు చాలా ఉన్నాయి. హీరో తన ప్రేమను హీరోయిన్ తండ్రికి చెబితే.. అతను ఒక తండ్రిగా వ్యతిరేకిస్తూ.. ఒక ఫ్రెండుగా మాత్రం అతడికి సహకారమందించడానికి సిద్ధపడతాడు. సినిమాలో కొంచెం కొత్తగా అనిపించే పాయింట్ ఇదొక్కటే కానీ.. అది కూడా అంత లాజికల్ గా అనిపించదు. కానీ ఈ విషయం మరీ ఎబ్బెట్టుగా అనిపించకుండా వినోదపు పూతతో కన్విన్సింగ్ గా చెప్పడానికి ప్రయత్నించారు రచయిత ప్రసన్న కుమార్.. దర్శకుడు త్రినాథరావు.

సినిమా ఎక్కడా కూడా భారంగా అనిపించకుండా.. సరదాగా సాగిపోవడం ‘హలో గురూ ప్రేమ కోసమే’కు ప్లస్. పాత్రల్ని కూడా అలాగే తీర్చిదిద్దారు. కమెడియన్ల మీద ఆధార పడకుండా రామ్-ప్రకాష్ రాజ్ లే వినోదాన్ని పంచే బాధ్యత తీసుకున్నారు. ప్రథమార్ధంలో యూత్ ఫుల్ గా సాగే సన్నివేశాలు.. మాటలు యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో పని చేసే సాఫ్ట్ వేర్ ఆఫీస్ నేపథ్యంలో సాగే సీన్లు నవ్వులు పంచుతాయి. రెండో హీరోయిన్ క్యారెక్టర్ని తేల్చి పడేసినా.. ఆ పాత్రతో ముడిపడ్డ కొన్ని సీన్లు నవ్విస్తాయి. రామ్-అనుపమ మధ్య వచ్చే సీన్లు కూడా పర్వాలేదు. వీరి మధ్య ప్రేమ పుట్టడానికి.. బలపడటానికి సరైన కారణాలు కనిపించవు. ఈ విషయంలో శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. మరీ సింపుల్ సీన్లతో తేల్చేశారు. దీని వల్ల ద్వితీయార్ధంలో ఒకరి కోసం ఒకరు తపించే సీన్లు సరిగా పండలేదు.

ద్వితీయార్ధం మొదలవగానే ఈ కథ ఎలా ముగియబోతోందన్న దానిపై ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేస్తారు. ఐతే ‘బొమ్మరిల్లు’.. ‘ఆకాశమంత’ సినిమాల్ని గుర్తుకు తెస్తూ సాగే ప్రకాష్ రాజ్ పాత్ర రెండో అర్ధభాగాన్ని కొంచెం నిలబెట్టింది. ఓవైపు కథానాయికకు తండ్రిగా.. మరోవైపు కథానాయకుడికి స్నేహితుడిగా ద్విపాత్రాభినయం చేసే సీన్లలో ఆయన మెప్పించారు. ఈ పాత్రతో ముడిపడ్డ సీన్లు కూడా బాగానే పండాయి. ఐతే ఎక్కడా కూడా ఎమోషనల్ డెప్త్ అన్నది లేకపోవడంతో ‘హలో గురూ ప్రేమ కోసమే’ మనసుల్ని తాకదు. పతాక సన్నివేశంలో అయినా ఏమైనా కొత్తదనం చూపిస్తారేమో అనుకుంటే నిరాశ తప్పదు. క్లైమాక్స్ మరీ సినిమాటిగ్గా తయారైంది. అక్కడైనా ఏమైనా ప్రత్యేకంగా ఉంటే ‘హలో గురూ..’ భిన్నమైన ఫీలింగ్ ఇచ్చేదేమో కానీ. ఓవరాల్ గా ఇది జస్ట్ ఓకే అనిపిస్తుంది.

నటీనటులు: రామ్ తనకు నప్పే పాత్రలో రాణించాడు. ఇందులోని సంజు క్యారెక్టర్ చాలా చోట్ల ‘నేను శైలజ’లో కథానాయకుడి పాత్రను గుర్తుకు తెస్తుంది. అందులో మాదిరే రామ్ అతి చేయకుండా తన పాత్రను అండర్ ప్లే చేయడానికి ప్రయత్నించాడు. కామెడీ సీన్లలో రామ్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా చేశాడు. రామ్ లుక్ కూడా బాగుంది. కెరీర్లో ది బెస్ట్ లుక్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా చేసింది. కాకపోతే ఆ పాత్రలో ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది. ఆమెకు కథలో ఉండాల్సినంత ప్రాధాన్యం లేదు. అనుపమ టాలెంట్ చూపించేందుకు ఎక్కువ స్కోప్ లేకపోయింది. కానీ అవసరమైనపుడు అనుపమ తన ప్రత్యేకతను చాటుకుంది. లవ్ ప్రపోజ్ చేసే సీన్లో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. ఇక ప్రకాష్ రాజ్ సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు. అలవాటైన పాత్రే అయినప్పటికీ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రణీత సినిమాకు మైనస్ అయింది. ఆమె లుక్ పేలవంగా ఉంది. పాత్రలోనూ విశేషం లేదు. ప్రణీత స్థానంలో మరో గుడ్ లుకింగ్ హీరోయిన్ని పెట్టాల్సిందనిపిస్తుంది. సితార.. పోసాని.. ఆమని.. ప్రవీణ్.. వీళ్లంతా తమ పరిధిలో బాగానే చేశారు.

సాంకేతికవర్గం: దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సంతృప్తినివ్వదు. మామూలు సినిమాల్ని కూడా కొన్నిసార్లు తన పాటలు.. నేపథ్య సంగీతంతో పైకి లేపే దేవి ఈసారి నిరాశ పరిచాడు. పాటలన్నీ ఓ మోస్తరుగా అనిపిస్తాయి. సినిమా మాదిరే పాటల్లోనూ కొత్తదనం లేదు. రామ్-ప్రకాష్ రాజ్ కలిసి పాడిన పాటలో మినహాయిస్తే.. దేవి ముద్ర పెద్దగా కనిపించదు. నేపథ్య సంగీతం కూడా సాధారణంగానే అనిపిస్తుంది. విజయ్.కె.చక్రవర్తి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి తప్ప దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లుగా లేవు. ఇక రచయిత ప్రసన్న కుమార్.. కథ విషయంలో తన దారి మార్చుకోలేదు. ఇప్పటికే తాను అరగదీసిన మామా అల్లుళ్ల కథనే రీసైకిల్ చేశాడు. మాటల విషయంలో మాత్రం ప్రసన్న ఆకట్టుకున్నాడు. సింపుల్ డైలాగులతోనే చాలా చోట్ల నవ్వించాడు. కొన్ని చోట్ల మాత్రం డైలాగులు లెంగ్తీగా తయారయ్యాయి. దర్శకుడు త్రినాథ రావు ఒక మామూలు కథను ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. ఐతే ప్రసన్న-త్రినాథరావు.. ఇక ఈ ఫార్ములాను వదిలేసి బయటికి రాకుంటే మాత్రం కష్టమే.

చివరగా: హలో గురూ.. రొటీన్ సినిమానే

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre