Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్‌!

By:  Tupaki Desk   |   28 March 2019 2:30 PM GMT
క్రిటిక్స్ మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్‌!
X
టాలీవుడ్ లో చీమ చిటుక్కుమ‌న్నా ఆ స‌మాచారాన్ని అంతే వేగంగా అందించేందుకు 150 మంది జ‌ర్న‌లిస్టులు నిరంత‌రం ప‌హారా కాస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం ప్రెస్ మీట్లు, లైవ్ ఈవెంట్లు అంటూ ఒక‌టే హ‌డావుడి వాతావ‌రణం క‌నిపిస్తుంది. అయితే గ‌త కొంత‌కాలంగా ``మీడియా డివైడ్ ఫ్యాక్ట‌ర్`` గురించి ఫిలింక్రిటిక్స్ స‌హా సినిమా వ‌ర్గాల్లో, టాలీవుడ్ నిర్మాత‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సినీప‌రిశ్ర‌మ 88 ఏళ్ల హిస్ట‌రీలో 40-50 ఏళ్లుగా ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ యాక్టివిటీస్ కొన‌సాగిస్తోంది. అయితే ఇటీవ‌ల క్రిటిక్స్ అసోసియేష‌న్ సుప్థావ‌స్త‌లోకి వెళ్లిపోవ‌డం .. యాక్టివిటీస్ స‌రిగా చేయ‌క‌పోవ‌డంపై సినీజ‌ర్న‌లిస్టుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు పెద్ద‌లు క్రిటిక్స్ అసోసియేష‌న్ సంపూర్ణంగా నిర్వీర్యం అయిపోవ‌డానికి కార‌ణ‌మ‌న్న విమ‌ర్శ‌లు జ‌ర్న‌లిస్టుల్లో వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా క్రిటిక్స్ అసోసియేష‌న్ తిరిగి జీవం పోసుకోకుండా అలానే సుప్థావ‌స్త‌లో ఉండ‌డంపై ఇంకా ఇంకా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష‌యంపై ప‌లువురు జ‌ర్న‌లిస్టులు మీడియా స‌మావేశాల్లో వాపోవ‌డం త‌ప్ప దానిని తిరిగి పున‌రుద్ధ‌రించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌క‌పోవ‌డంపైనా విమ‌ర్శ‌లు పోటెత్తుతున్నాయి.

అయితే ఈ అసోసియేష‌న్ తో ప్ర‌యోజ‌నం లేద‌ని భావించిన ఎల‌క్ట్రానిక్ మీడియా- వెబ్ మీడియా జ‌ర్న‌లిస్టులు సొంతంగా ఫిలిం న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ (ఎఫ్ ఎన్ ఏఈఎం) ప్రారంభించి యాక్టివిటీస్ ప్రారంభించారు. ఆ క్ర‌మంలోనే విచ్చ‌ల‌విడిగా వ‌చ్చి ప‌డుతున్న యూట్యూబ్ - వెబ్ మీడియాపై కంట్రోల్ ప్రారంభించారు. అయితే అది కూడా అప‌స‌వ్య దిశ‌లో సాగింద‌న్న విమ‌ర్శలు ఇటీవ‌ల వెల్లువెత్తాయి. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల్లో చాలా మంది అటు ప్రింట్ మీడియా తో పాటు సైమ‌ల్టేనియ‌స్ గా వెబ్ మీడియాలో, ఫ్రీల్యాన్స‌ర్స్ గానూ కొన‌సాగుతున్నారు. ప్రింట్ లో ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు సంబంధం లేనిదిగా కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ కొన‌సాగుతుండ‌డంతో చిన్న పాటి స్ఫ‌ర్థ‌లు త‌లెత్తాయి. అయితే క్రిటిక్స్ అసోసియేష‌న్ పెద్ద‌ల‌తో కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ కి ఏవైనా విభేధాలున్నాయా? అని ఆరాతీస్తే చిన్న‌పాటి మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ లో స‌భ్య‌త్వం కోసం ప్ర‌య‌త్నించిన 5-15 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు ఇంత‌వ‌ర‌కూ స‌భ్య‌త్వాలు ఇవ్వ‌లేదు. అడిగిన ప్ర‌తిసారీ తిర‌స్క‌రించ‌డంతో విసిగిపోయిన వాళ్లు ఉన్నారు. అందుకే ప్ర‌స్తుతం వీళ్లంతా న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ యాక్టివిటీస్ ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లింత‌కీ ప్రింట్ మీడియాలో ప‌ని చేసేవాళ్ల ప‌రిస్థితి ఏంటి? వారిని న్యూస్ కాస్ట‌ర్స్ లో చేర్చుకుంటారా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అయితే త‌మ‌లో క‌లుపుకునేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సినీజ‌ర్న‌లిస్టులంతా ఒక‌టేన‌ని న్యూస్ కాస్ట‌ర్స్ చెబుతుండ‌డం న‌వ‌త‌రంలో ఆశావ‌హ ధృక్ప‌థాన్ని క‌లిగిస్తోంది. `పెట్ట‌న‌మ్మ పెట్ట‌దు.. తినేవాళ్ల‌ను తిన‌నివ్వ‌దు!`` అన్న చందంగా 10-15ఏళ్లుగా సినీజ‌ర్న‌లిస్టులుగా ప‌ని చేసే ఎంద‌రో యువ‌కుల భ‌విష్య‌త్ ఇక్క‌డ ఆగ‌మ్య‌గోచ‌రంగా డైల‌మాలో ప‌డిపోవ‌డానికి కార‌ణం అస‌లైన ``ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్`` అన్న విమ‌ర్శ‌లు పోటెత్తుతున్నాయి. స్వార్థ‌ప‌రులంతా క‌లిసి పెట్టుకున్న అసోసియేష‌న్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అన్న దారుణ వ్యాఖ్య‌ల్ని ప్రెస్ మీట్ల‌లో వినాల్సిన దారుణ ధైన్యం దాపురించింది. అందుకే ప్రింట్ లో న‌వ‌త‌రం సినీజ‌ర్న‌లిస్టులు త‌మ‌కు భరోసా క‌ల్పించే ఒక నాయ‌క‌త్వం ఆద‌ర‌ణ అవ‌స‌రం అని భావిస్తున్నారు. అయితే ప్రింట్ మీడియా జ‌ర్న‌లిస్టులు .. సీనియ‌ర్ ఫోటోగ్రాఫ‌ర్లు న్యూస్ టెలీకాస్ట‌ర్స్ తో చ‌ర్చిస్తే కొంత‌వ‌ర‌కూ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం ఉంది. అయితే ఆ ప్ర‌య‌త్న‌మే జ‌ర‌గ‌క‌పోవ‌డంపై ప్ర‌స్తుతం వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. వాళ్లు- వీళ్లు మన‌స్ఫ‌ర్థ‌లేవైనా ఉంటే.. క‌లిసి మాట్లాడుకోవాలి. మాట‌ల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్ !! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డంపైనా స‌ర్వత్రా జ‌ర్న‌లిస్టుల్లో వేడెక్కించే డిబేట్ ర‌న్ అవుతోంది. ఇక న్యూస్ కాస్ట‌ర్స్ దూకుడుగా ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు అంటూ ప‌రిశ్ర‌మ బ‌డా నిర్మాత‌ల‌ నుంచి సాయం కోరగానే ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు వ‌చ్చి ప‌డ్డాయి. దీంతో 10-20 ఏళ్లుగా ఈ రంగంలో ప‌ని చేస్తున్నా ఆ అసోసియేష‌న్ లో మాకు స‌భ్య‌త్వ‌మైనా లేదే! అని క‌ల‌త చెందే ప్రింట్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. తుమ్మినా ద‌గ్గినా ఉద్యోగం ఊడే ఈ పాడు జ‌ర్న‌లిజంలో అభ‌ద్ర‌త‌కు ఎవ‌రి స్వార్థం కార‌ణ‌మైంది? అస‌లింత‌కీ ఈ పాపం ఎవ‌రిది? దీనికి ప‌రిష్కార మార్గమే లేదా? నిష్ఠూర‌మైన నిజం తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావో విక్ర‌మార్కా నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును... అంటూ ఆవేద‌న జ‌ర్న‌లిస్టుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.