పెట్ట స్టోరీ చక్కర్లు కొడుతోంది

Tue Jan 01 2019 15:15:08 GMT+0530 (IST)

ఏడాది వ్యవధిలో ఒకటి కాదు ఏకంగా మూడు సినిమాలతో పలకరించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్ట జనవరి 10 విడుదల కోసం ముస్తాబవుతోంది. అజిత్ విశ్వాసంతో క్లాష్ ఉన్నప్పటికీ తలైవా క్రేజ్ కు వచ్చిన భయమేమి లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పోస్టర్లు ఇదో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ అన్న గ్యారెంటీ ఇవ్వడంతో అభిమానులు బాషా నరసింహ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇకపోతే పెట్ట తాలూకు కథ అంటూ ఓ వార్త చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజమో కాదో కానీ లైన్ అయితే ఆసక్తికరంగానే ఉంది. అదేంటో చూద్దాం.



 కాళీ(రజనీకాంత్)ఓ గ్రామం పెద్ద. అందరికి తలలో నాలుకగా ఉంటూ భార్య(త్రిష)ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇతనికి తమ్ముడు మలిక్(శశికుమార్)అంటే ప్రాణం. అనుకోకుండా ఆ ఊరికి సింగార్ సింగ్(నవాజుద్దీన్ సిద్ధిక్)వల్ల ముప్పు ఏర్పడుతుంది. అప్పుడు జరిగిన గొడవల్లో కాళీ తమ్ముడితో పాటు భార్యను పోగొట్టుకుని ఊరొదిలి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఓ హాస్టల్ వార్డెన్ గా చేరతాడు కాళీ. అక్కడ విద్యార్ధి నాయకుడు మైకేల్(బాబీ సింహ)దే రాజ్యం. కాళీ అతనికి నచ్చడు. బయటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే పారు(సిమ్రాన్)కాళీ మీద మనసు పారేసుకుంటుంది మరోవైపు గ్రామంలో గొడవల వల్ల దెబ్బ తిని కసి మీదున్న జీతూ(విజయ్ సేతుపతి)కాళీని చంపేందుకు వెతుకుతూ ఉంటాడు.

ట్విస్ట్ ఏమిటంటే కాళీతో పాటు అతని తమ్ముని పిల్లలు అదే కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్లను ప్రత్యేకంగా కాస్తూ ఉంటాడు కాళీ. సింగార్ సింగ్-జీతులకు కాళీ జాడ తెలుస్తుంది. అక్కడి నుంచి కథ కొత్త మలుపులు తీసుకుంటుంది. మరి కాళీ ఈ పద్మవ్యూహాన్ని ఎలా చేధించాడు అనేదే పేట కథ. రజని ఎందుకు ఊరు వదిలాడు సింగార్ జీతులతో వచ్చిన కక్ష ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం పేటలో చూడాల్సిందే. పాయింట్ అయితే ఆసక్తికరంగా ఉంది. ఇది నిజమో కాదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ మసాలా అంశాలు ఎలా డీల్ చేసుంటాడు అనే దాని మీదే పేట బాక్స్ ఆఫీస్ ఫలితం ఆధారపడి ఉంది.