Begin typing your search above and press return to search.

2.0 కలెక్షన్స్ కి పాలిటిక్స్ లింకా ?

By:  Tupaki Desk   |   6 Dec 2018 7:32 AM GMT
2.0 కలెక్షన్స్ కి పాలిటిక్స్ లింకా ?
X
సూపర్ స్టార్ రజనికాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 అంచనాలకు భిన్నంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు ఏమి చేయడం లేదు. మొదటి నాలుగు రోజులు తప్ప వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. వీకెండ్ నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల దాకా రాబట్టిన 2.0 ఆ తర్వాతి 3 రోజులకు కేవలం ఐదు కోట్లు మాత్రమే జోడించడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. దీని ఒరిజినల్ వెర్షన్ రూపొందిన తమిళనాడులో సైతం దీనికి భిన్నంగా ఏమి లేదు. పైపెచ్చు ఇంకా దారుణంగా ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఒక్క చెన్నై తప్పిస్తే 2.0 ఎక్కడా కనీసం మెర్సల్ రికార్డ్స్ ని దాటడం కూడా కష్టమే అని లెక్కలు చెబుతున్నాయి. ఇదలా ఉంచితే రజని మునుపటిలా మేజిక్ చేయలేక పోవడానికి కారణం అతను రాజకీయాల్లోకి ప్రవేశించి బిజెపికి అనుకూలంగా మాట్లాడ్డమే అని కొందరు విశ్లేషకులు కొత్త కోణాన్ని సృష్టించడం విస్మయాన్ని కలిగిస్తోంది. నిజానికి హీరోల నటజీవితం రాజకీయం రెండు వేర్వేరు పార్శ్యాలు. అభిమానులు కాని ప్రేక్షకులు ఒకదానికి మరొకటి ముడిపెట్టి చూడరు. చిరంజీవి ప్రజారాజ్యంని కాంగ్రెస్ ని విలీనం చేసాక ఖైది నెంబర్ 150తో తిరిగి సినిమాల్లోకి వచ్చి వంద కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి ఔరా అనిపించారు. దానికి కారణం కేవలం హస్తం పార్టీ గుర్తు వాళ్ళే అనగలరా.

స్వర్గీయ ఎన్టీఆర్ సిఎంగా చేసాక మేజర్ చంద్రకాంత్ చేసినప్పుడు అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పుడు చూసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే కాదు కదా. సో రజనీకాంత్ మాత్రమే దీనికి మినహాయింపుగా నిలుస్తాడు అంటే అది అబద్దమే అవుతుంది. 2.0 లో టెక్నికల్ కంటెంట్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కథనంలో టెంపో తో పాటు ఎమోషన్స్ పూర్తిగా జీరో అయిన మాట వాస్తవం. కనీసం విలన్ పక్షిరాజా మీద బిల్డప్ చేసిన ఎమోషనల్ కంటెంట్ లో సగం హీరో పాత్రకు రాసుకోలేదు శంకర్. పైగా భీభత్సమైన ఫైట్లు తప్పితే బలమైన మలుపులు 2.0లో ఏమి లేవు. అవి టాక్ రూపంలో బయటికి వచ్చి వసూళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి తప్ప రాజకీయం వైపు రజని మళ్ళడం వల్లే 2.0 కలెక్షన్లు తగ్గాయి అన్న పాయింట్ లో కించిత్ లాజిక్ కూడా లేదు.