Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలు ఉంటాయా?

By:  Tupaki Desk   |   20 Jan 2019 5:36 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలు ఉంటాయా?
X
ఎన్టీఆర్ కథానాయకుడి ఫలితం దారుణంగా నిరాశ పరిచిన వేళ ట్రేడ్ తో సహా ప్రేక్షకుల్లోనూ మహనాయకుడి మీద ఏమంత ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది గుర్తించే క్రిష్ టీమ్ ముందు చెప్పిన డేట్ కాకుండా ఇంకొంత ఆలస్యంగా విడుదల చేయటం గురించి ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది. అనధికార సమాచారం ఫిబ్రవరి 14 అంటుండగా మరికొన్ని వర్గాలు ఏకంగా ఎన్నికలయ్యాక అని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా వర్మ మరోపక్క చాలా తెలివిగా లక్ష్మిస్ ఎన్టీఆర్ ప్రమోషన్ వేగాన్ని అమాంతం పెంచేసాడు. బాబు-లక్ష్మీ పార్వతి లుక్స్ తో పాటు ఎన్టీఆర్ వేషం వేసిన ఆర్టిస్ట్ ని చూపించేయడంతో అసలు దీని షూటింగ్ జరుగుతోందా లేదా అనే అనుమానాలకు చెక్ పడిపోయింది.

ఎప్పుడు విడుదల అనేది చెప్పడం లేదు కానీ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ ని తీసుకురావడం ఖాయమని తేలిపోయింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఊహించని విధంగా ఫెయిల్యూర్ కావడంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ ని జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు లేకపోలేదు. ఇది ముందే గుర్తించిన వర్మ ఎప్పటికప్పుడు తన సినిమాలో నిజాలు మాత్రమే ఉంటాయని వెన్నుపోటు మొదలుకుని ఆయన జీవితం లక్ష్మి పార్వతితో వివాహం అయ్యాక ఎలాంటి మలుపులు తిరిగిందో మొత్తం చూపిస్తానని పదే పదే అంటున్నాడు. ఈ పబ్లిసిటీ కొంత పాజిటివ్ గానే పనిచేస్తోంది.అయితే సహజంగానే బాగా వివాదాస్పదంగా జనం మదిలో నిలిచిపోయిన ఎన్టీఆర్ చరమాంక జీవితాన్ని వర్మ ఎలా చూపుతాడు అనే ఆసక్తి మొదలయింది.

అయితే ఇలా హైప్ క్రియేట్ చేయడం తర్వాత తుస్సుమనిపించడం వర్మకు పరిపాటిగా మారింది. ఒక్క రక్త చరిత్ర ఫస్ట్ పార్ట్ మాత్రమే అంచనాలు నిలబెట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం మెప్పించలేదు. కిల్లర్ వీరప్పన్ అంటూ అడవిదొంగ బయోపిక్ చేస్తే అదీ అంతే. వంగవీటికి మూటగట్టుకున్న విమర్శలెన్నో. ఇప్పుడు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అంత పచ్చిగా నిజాలు చూపిస్తాడా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా అధికార పార్టీ ముఖ్య మంత్రిని నెగటివ్ పాత్రలో చూపిస్తున్న వర్మ సాహసం అసలు వెండితెర దాకా వస్తుందా లేక సెన్సార్ మెట్ల దగ్గర ఇబ్బందులు పడుతుందా అనేది వేచి చూడాలి. అక్కడ దాకా వస్తే ఆన్ లైన్ లో వదిలేందుకు కూడా వర్మ వెనుకాడడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎంత వరకు నిజాలు ఉంటాయి అనే విషయంలో మాత్రం అనుమానాలు ఇప్పట్లో తొలగడం కష్టమే