Begin typing your search above and press return to search.

బాలయ్య కూడా యు టర్న్ తీసుకుంటాడా?

By:  Tupaki Desk   |   15 Dec 2018 1:30 AM GMT
బాలయ్య కూడా యు టర్న్ తీసుకుంటాడా?
X
తెలుగుదేశం అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అందరూ యు టర్న్ బాబు అంటారన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ మధ్య ఈ పేరు బాగా పాపులర్ అయింది. నాలుగేళ్లకు పైగా సహవాసం చేసిన భారతీయ జనతా పార్టీతో ఉన్నట్లుండి తెగతెంపులు చేసుకుని మోడీ మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాడు బాబు. అంతే కాక దశాబ్దాలుగా తిట్టి పోస్తున్న కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి ఆ పార్టీ మీద.. రాహుల్ గాంధీ మీద ప్రశంసలు కురిపిస్తున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో.. ఇంకా మరెన్నో విషయాలపై బాబు ఎలా యు టర్న్ తీసుకున్నాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాబు ఉన్నట్లుండి కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడంతో ‘యన్.టి.ఆర్’ సినిమాలో కొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సి వచ్చిందట ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో. ఆ పార్టీ మీద అప్పట్లో ఆయన చేసిన విమర్శలు సంచలనం రేపాయి. కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే డైలాగులెన్నో సినిమాలో పెట్టారట. చంద్రబాబుకు సంబంధించిన ప్రతికూల విషయాలేవీ సినిమాలో పెట్టేఅవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో ఎన్టీఆర్ సమరాన్నే సినిమాలో హైలైట్ చేశారట. ఐతే ఉన్నట్లుండి బాబు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టడంతో ఆ తరహా సన్నివేశాల టోన్ బాగా తగ్గించేశారట. సినిమా ఉన్నదున్నట్లు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీతో సమస్య అని వెనక్కి తగ్గారట. ఐతే ఇంతలోనే తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం దోస్తీ ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. వీరి కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వెంటనే రెండు పార్టీల మధ్య దూరం మొదలైంది.

కొన్ని రోజుల్లోనే ఇరు పార్టీలు బ్రేకప్ చెప్పుకుని ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య సైతం బాబు తరహా యుటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు తీసిన ప్రకారమే కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ టార్గెట్ చేసిన సన్నివేశాల్ని అలాగే ఉంచేద్దామని బాలయ్య అండ్ కో భావిస్తున్నట్లు సమాచారం.