Begin typing your search above and press return to search.

బాహుబ‌లి, పాతాళ భైర‌వికి కాపీ?!

By:  Tupaki Desk   |   15 Dec 2018 10:28 AM GMT
బాహుబ‌లి, పాతాళ భైర‌వికి కాపీ?!
X
ఇటీవ‌ల హాలీవుడ్ సినిమాల స‌ర‌ళి ప‌రిశీలిస్తే ఓ కామ‌న్ పాయింట్ విస్మ‌యం క‌లిగిస్తోంది. ఈ సినిమాల‌న్నిటినీ భార‌తీయ పురాణేతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తెర‌కెక్కిస్తున్నారా? అనే సందేహం క‌ల‌గ‌క మాన‌దు. రీసెంట్ సూప‌ర్‌మ‌న్ తర‌హా సినిమాల క‌థ‌ల‌న్నీ మ‌న పురాణాల నుంచి కాపీ కొట్టిన‌వేన‌న‌డంలో సందేహం లేదు. అప్ప‌ట్లో `అవ‌తార్` సినిమాకి రామాయ‌ణం నుంచి స్ఫూర్తి పొంది క‌థ రాసుకున్నామ‌ని జేమ్స్ కామెరూన్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అవ‌తార్ నీలి రంగు రూపానికి రాముడు స్ఫూర్తి. అవ‌తార్ కి తోక త‌గిలించ‌డానికి ఆంజనేయుడు స్ఫూర్తి.

నాటి నుంచి హాలీవుడ్ రైట‌ర్స్ అంతా మ‌న పురాణాల్ని పుక్కిట ప‌ట్టి వాటినే తిరిగి సినిమాలుగా తీసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నార‌న్న‌ సందేహం క‌లుగుతోంది. అయితే అందుకు అత్యున్న‌త‌మైన సాంకేతిక‌త‌ను తెలివిగా ఉప‌యోగించుకుని మోడ్ర‌నైజ్ చేస్తున్నార‌నడంలో క‌ల్ప‌న ఏమాత్రం లేదు. పాత క‌థ‌ల్నే వీఎఫ్ ఎక్స్ మాయాజాలం తో నెక్ట్స్ జెన్ సినిమాలుగా అందిస్తున్నారు. రీసెంటు గా రిలీజైన బ్లాక్ పాంథ‌ర్, అవెంజ‌ర్స్ స‌హా ప్ర‌తిదీ మాయ‌లు మంత్రాలు, శ‌క్తులు అంటూ ఆస‌క్తిగా ఇండియ‌న్ రెజియ‌న్ ఆడియెన్‌కి అర్థ‌మ‌య్యేలానే తీశారు.

తాజాగా ఈ శుక్ర‌వారం `ఆక్వామేన్ 3డి` ఇండియాలో వారం ముందే రిలీజైంది. ఈ సినిమా క‌థ ప‌రిశీలిస్తే ఫ‌క్తు `పాతాళ భైర‌వి`నే త‌ల‌పిస్తోంది. మ‌న పురాణేతిహాసాల నుంచి కాపీ కొట్టిన క‌థ‌ను మోడ్ర‌నైజ్డ్ టెక్నాల‌జీ- వీఎఫ్ఎక్స్ మాయాజాలంతో తీశారంతే. మ‌న విఠ‌లాచార్య తీసిన సినిమాలు ప‌ది కాపీ కొట్టి ఆక్వామేన్ తీశారా? అన్న‌ట్టే ఉంది. అయితే మ‌న సినిమాలన్నీ భూమ్మీద న‌డిచే క‌థ‌ల‌తో తెర‌కెక్కిన‌వి. ఆక్వామేన్ పూర్తిగా స‌ముద్రంలో భూమికి సమాంత‌రంగా న‌డిచే వేరొక క‌థ‌. స‌ముద్రంలో జ‌ల‌చ‌రాల న‌డుమ జ‌ల‌చ‌రాల్లా ప్ర‌వ‌ర్తించే సూప‌ర్‌మేన్‌ల క‌థ ఇది. ఇందులోనూ మాయ‌లు, మంత్రాలు, క‌నిక‌ట్టు విద్య‌లు, యుద్ధాలు అన్నీ య‌థావిధిగా మ‌ళ్లీ మ‌న `పాతాళ‌భైర‌వి` క‌థే. ఇక తెలుగు సినిమాల్లో ఎన్నో సినిమాల‌కు ప్ర‌ధాన ఇతివృత్తం అయిన అన్న‌ద‌మ్ముల కాన్‌ఫ్లిక్ట్‌ని ఈ సినిమా కోసం వాడేశారు. ఒకే త‌ల్లికి పుట్టిన ఇద్ద‌రు బిడ్డ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. రాజ్యాధికార కాంక్ష అనే పాయింట్ల‌ను మ‌న రాజుల సినిమాల్లో ఎన్నో చూసేశాం.

ఇటీవ‌లే `బాహుబ‌లి` కాన్సెప్టు కూడా ఇదే. అయితే `ఆక్వామేన్‌`లో భూమ్మీద ఉన్న మాన‌వునితో సాగ‌ర క‌న్య సంగ‌మం వ‌ల్ల జ‌న్మించిన వాడికి, సాగ‌రంలో తండ్రికి జ‌న్మించిన సుపుత్రునికి మ‌ధ్య యుద్ధాన్ని (బ్ర‌ద‌ర్స్ వార్‌) చూపించారు. నాటి విఠ‌లాచార్య, కె.వి.రెడ్డి (జ‌గ‌దేక వీరుని క‌ద‌, గుణ‌సుంద‌రి క‌థ‌, శ్రీ‌కృష్ణార్జున యుద్ధం) సినిమాల్ని నేడు హాలీవుడ్ వాళ్లు అధునాత‌న సాంకేతిక‌త‌తో తీస్తున్నారేమో అనిపించ‌క మాన‌దు. 3డి, వీఎఫ్ఎక్స్ మాయాజాలంతో క‌ట్టి ప‌డేసే విజువ‌ల్ వండ‌ర్ ఆక్వామేన్. భూమికి స‌మాంత‌రంగా స‌ముద్రంలో మ‌రో కొత్త‌లోకంలో మాంత్రిక తాంత్రిక విద్య‌లు.. వ‌గైరా ఫిక్సన్ ..చూపించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది రూపాయ‌ల్ని నొల్లుకుంటున్నార‌న్న‌మాట‌!!