ఇంకా బ్రేక్ కావాలా బన్నీ ?

Sat Dec 15 2018 23:00:01 GMT+0530 (IST)

ఎన్నడూ లేనిది కోరుకోకుండానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విపరీతమైన గ్యాప్ ని ఇష్టం లేకపోయినా భరిస్తున్నాడు. ఎంతో నమ్మి ఫిజికల్ గా మేకోవర్ చేసుకుని మరీ నటించిన నా పేరు సూర్య తాలూకు చేదు అనుభవం ఇంకా పచ్చిగానే ఉంది. దాని దెబ్బకు కథలను దర్శకులను గుడ్డిగా నమ్మకూడదు అని నిర్ణయించుకున్న బన్నీ గత ఏడు నెలలుగా ఖాళీ గానే ఉన్నాడు. మధ్యలో విక్రమ్ కుమార్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లే లోపే మిడిల్ డ్రాప్ అయ్యింది. కారణాలు బయటికి తెలియకపోయిన స్క్రిప్ట్ విషయంలో వచ్చిన విభేదాలే అని ఇన్ సైడ్ టాక్ బలంగా నడిచింది.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ తర్వాత బన్నీకి కథను రెడీ చేయడంలోనే బిజీ గా ఉన్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే విక్రమ్ కుమార్ తో వచ్చిన చిక్కే దీనికీ వచ్చినట్టు మరో టాక్ కూడా నడుస్తోంది. ఈ అయోమయం మరికొంత కాలం నడిచేలా ఉంది. అంతా సెట్ అయితే జనవరి 1 నుంచి త్రివిక్రమ్ బన్నీ కాంబో మూవీ స్టార్ట్ కావొచ్చు. ఒకవేళ అప్పటికీ స్క్రిప్ట్ సిద్ధం కాకపోతే తర్వాత జరిగే పరిణామం ఏమో కానీ ఏడాది గ్యాప్ తీసుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయని తెలుస్తోంది.

మెగా హీరోలు ఇలా ఏడాది గ్యాపులు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. చిరంజీవి వరుస ఫ్లాపుల దెబ్బకు 1995 మొత్తం ఖాళీగా ఉండి 96లో హిట్లర్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ధృవ లాంటి హిట్ వచ్చినా రామ్ చరణ్ సమయం తీసుకుని మరీ రంగస్థలం కు ఓటేశాడు. ఇవన్ని మంచి ఫలితాలు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ సైతం కెరీర్ మధ్యలో ఇచ్చిన ఇలాంటి బ్రేక్స్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాయి. అందుకే బన్నీ కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నట్టు మెగా కాంపౌండ్ టాక్. అదెలా ఉన్నా అభిమానులు మాత్రం అంత సుదీర్ఘ నిరీక్షణ అంటే భరించడం కష్టమే.