Begin typing your search above and press return to search.

పంపిణీదారులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే..!

By:  Tupaki Desk   |   20 Sep 2019 6:45 AM GMT
పంపిణీదారులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే..!
X
ఏదైనా సినిమా రిలీజ్ ముంగిట ఊగిస‌లాటతో ఎవ‌రికి న‌ష్టం? అంటే .. అప్ప‌టికే సినిమా అమ్మేసిన వారికి న‌ష్టం ఉండ‌దు. నిర్మాత సేఫ్ అవుతాడు. రూల్ ప్ర‌కారం సినిమా రిలీజ్ ముందే ఆర్టిస్టులు.. ద‌ర్శ‌కుడు.. టెక్నీషియ‌న్ల‌కు పారితోషికాలు చెల్లించేస్తారు కాబ‌ట్టి వాళ్ల‌కు న‌ష్టం ఉండ‌దు. చివ‌రిగా ఎవ‌రైతే సినిమాని కొనుక్కుని రిలీజ్ చేయ‌లేక‌పోయారో ఆ పంపిణీదారుల‌కు మాత్రం తీవ్ర‌మైన న‌ష్టం ఉంటుంది. అప్పులు చేసి పెట్టిన పెట్టుబ‌డి పోయ‌న‌ట్టే.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్థావిస్తూ వాల్మీకి ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఎమోష‌న్ అయ్యారు. వాల్మీకి టైటిల్ ని `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` గా మార్చి నేడు రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. టైటిల్ డైల‌మాపై పాత్రికేయ స‌మావేశంలో హ‌రీష్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ - వాల్మీకి టైటిల్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి బోయ‌-వాల్మీకి వ‌ర్గాల‌ నుండి నిరసనలు మొద‌ల‌య్యాయి. అప్ప‌టికీ మా టీమ్ న‌మ్మ‌కం ఏంటంటే వాల్మీకి మ‌హ‌ర్షి త‌ప్పు చేసిన‌ట్లు ఎక్క‌డా చూపించ‌లేదు. సినిమా చూసిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా మ‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని బాధ‌ప‌డి నిర‌స‌న తెలిపిన‌ వారికి రియ‌లైజేష‌న్ వస్తుందనుకుంటున్నాం. వారు క‌చ్చితంగా మ‌మ్మ‌ల్ని మెచ్చుకుంటార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంత‌రాలుంటే సెన్సార్ ప‌రిధిలో ప‌రిష్కారం అవుతుంద‌నుకున్నాం. సెన్సార్ స‌భ్యులు సినిమా చూశారు. వాల్మీకి మ‌హ‌ర్షి గురించి ఎక్క‌డా త‌ప్పుగా చెప్ప‌డం కానీ.. చూపించ‌డం కానీ లేదు కాబ‌ట్టి.. స‌గం స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని అనుకున్నాం. అయితే బోయ సంఘం-వాల్మీకి వ‌ర్గం టైటిల్‌ లో తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. దాన్ని మార్చాం. అనంత‌పురం- క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ ఆఫీస్ నుండి సినిమా రేపు రిలీజ్ అన‌గానే సినిమాను ఆపేయాలంటూ ఉత్త‌ర్వులు మాకు వ‌చ్చాయి. రేపు రిలీజ్ వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ను ఇంత వ‌ర‌కు ఎందుకు తీసుకొచ్చార‌నే భావ‌న అంద‌రికి ఉంటుంది.

నా సినిమాలు చూడ‌ని మా నాన్న‌గారు కూడా తొలిసారి ఆయ‌న టైటిల్ అనౌన్స్ చేయ‌గానే.. చాలా మంచి టైటిల్ పెట్టావ‌ని ఫోన్ చేశారు. సినిమా ఎలా ఉందో తెలియ‌కుండా నేను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాలో అర్థం కావ‌డం లేదు... అని హ‌రీష్ ఎమోష‌న్ అయ్యారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మేం 14-15 గంట‌లు పాటు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాం. పారితోషికాలు అందుకున్న మేం సేఫ్. పంపిణీదారుల ప‌రిస్థితిని అర్థం చేసుకోవాలి. వాళ్లు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌న్న‌దే ఆవేద‌న అని అన్నారు.

ఈ ప‌రిస్థితిని కావాల‌నే ఎవ‌రూ తెచ్చుకోరు. మేం ఓ మంచి టైటిల్ పెట్టాం. ఇలాంటి టైటిల్‌ను పెట్ట‌డం ద్వారా వాల్మీకి మ‌హ‌ర్షి గొప్ప‌త‌నం తెలియ‌నివారికి కూడా తెలుస్తుంద‌ని అనుకున్నాం. 30 కోట్లు ఖ‌ర్చుపెట్టి 200 మంది టెక్నీషియ‌న్స్ ఈ సినిమాపై ప‌నిచేస్తూ ఎవ‌రినో విమ‌ర్శించడానికి ఈ ప‌నిచేయ‌లేదు... అని వివ‌ర‌ణ ఇచ్చారు హ‌రీష్‌. మొత్తానికి పంపిణీదారుల్ని కంగారు పెట్ట‌కూడ‌ద‌నే చివ‌రి నిమిషంలో ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని అర్థ‌మైంది. ఈ వివాదం ప‌రిశ్ర‌మ‌కు కూడా ఓ క‌నువిప్పు అని అనుకోవాలి. ఇక‌పై టైటిల్స్ మార్చాల్సి వ‌స్తే వివాదాన్ని అంత‌వ‌ర‌కూ తేకూడ‌ద‌ని అర్థమైంది అంద‌రికీ.