హన్సిక అతి మామూలుగా లేదుగా..

Tue Jan 01 2019 15:02:44 GMT+0530 (IST)

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని ఒక సామెత. హన్సిక వ్యవహారం ఇలాగే ఉంది. ఆమె కెరీర్ చరమాంకానికి వచ్చేసిందని అందరికీ తెలుసు. ఆమెకు మునుపటి క్రేజ్ లేదు. కొన్నేళ్లుగా ఆమె చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయట్లేదు. ఏవో అవకాశాలు వస్తున్నాయి కానీ.. అవి ఆమె స్థాయికి తగినవి కావు. ఇక హన్సిక కెరీర్ ముగిసినట్లే అనుకుంటున్న దశలో ఒక సెన్సేషనల్ మూవీతో రచ్చ లేపడానికి ప్రయత్నిస్తోంది పాల బుగ్గల సుందరి.హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మహా’. ఆమెకిది 50వ సినిమా అట. ఇందులో ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ చేస్తోంది హన్సిక. ‘మహా’లో రకరకాల అవతరాల్లో కనిపిస్తోందామె. ఆ మధ్య హన్సికకు స్వామీజీ అవతారం వేసి దమ్ము కొట్టిస్తూ ఒక పోస్టర్ వదిలారు. అది తీవ్ర దుమారం రేపింది. ఇలాంటివే మరికొన్ని పోస్టర్లు వదిలారు. అవి చాలవని ఇప్పుడు నూతన సంవత్సర కానుకగా ఇంకో పోస్టర్ వదిలారు.

రక్తంతో నిండిన బాత్ టబ్ లో గన్ను పట్టుకుని పొగరుగా చూస్తూ పడుకుని ఉంది ఈ పోస్టర్లో హన్సిక. జనాల్ని ఏదో ఒక రకంగా ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కొంచెం అతి జోడించి పోస్టర్లు వదులుతున్నట్లుంది. ఇలా పోస్టర్లతో హడావుడి చేసి.. రొటీన్ సినిమా చూపించడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు త్రిష నటించిన ‘నాయకి’.. ‘మోహని’ సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. మరి హన్సిక భిన్నంగా సినిమాలో ఏం చేస్తుందో చూడాలి. జమీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ-తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.