Begin typing your search above and press return to search.

వివాదాలు కోరి తెచ్చుకున్న యాపిల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Dec 2018 9:11 AM GMT
వివాదాలు కోరి తెచ్చుకున్న యాపిల్ బ్యూటీ
X
సినిమాలకు సంబంధించి సృజనాత్మకతకు ఎలాంటి పరిమితులు ఉండవు కాని ఎంచుకున్న కాన్సెప్ట్ ని బట్టి ఎవరివైనా మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందేమోనన్న కోణంలో ఒకటికిరెండు సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అవేవి చూసుకోకుండా యాపిల్ బ్యూటీ హన్సిక చేసిన ఓ మూవీ చిక్కుల్లో పడేలా ఉంది. తన 50వ సినిమాగా రూపొందిన దాని పేరు మహా. యుఆర్ జమీల్ దర్శకత్వంలో రూపొందిన మహాకు జిబ్రాన్ సంగీత దర్శకుడు.

షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్స్ టీమ్ విడుదల చేసింది. అందులో హన్సిక ఇచ్సిన భంగిమ వివాదాలకు కారణం అవుతోంది. ఓ బాబాను పోలి ఉండే అవతారంలో వెనుక పవిత్ర పుణ్య క్షేత్రం కాశి బ్యాక్ డ్రాప్ లో హన్సిక సిగరెట్ తాగుతున్నట్టు ఇచ్చిన స్టిల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇలా చేయడం పట్ల ఇప్పటికే కొన్ని సంఘాలు చిత్ర యూనిట్ మీద భగ్గుమంటున్నాయి.

ఇది ఖచ్చితంగా ఒక వర్గం విశ్వాసాలను దెబ్బ తీయడమేనని హిందూ సంస్కృతిని అవమానపరిచే విధంగా ఇలా చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీమ్ ఇంకా దీని గురించి స్పందించడం లేదు. కథ డిమాండ్ మేరకు ఆలా చూపించాల్సి వచ్చింది తప్ప మరో ఉద్దేశం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. వేషాలు మార్చి మోసాలు చేసే మాయలేడి వేషంలో హన్సిక రోల్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. అయినా ఏదో ఒక రకంగా ఇలాంటి పబ్లిసిటీ ఫ్రీ ప్రచారాన్ని తెచ్చేదే. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.