Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను లాక్కొచ్చిన గుణశేఖర్

By:  Tupaki Desk   |   22 Nov 2017 4:37 AM GMT
ఎన్టీఆర్ ను లాక్కొచ్చిన గుణశేఖర్
X
నంది అవార్డులు ఇవ్వడంలో అన్యాయం చేశారంటూ ఈసారి మొదలైన వివాదం కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదనే పాయింట్ చుట్టూ తిరగాల్సిన వివాదం కులం.. ప్రాంతం.. రాష్ట్ర స్థాయికి చేరుకుంది. తాను తీసిన చారిత్రక చిత్రం రుద్రమదేవికి అన్యాయం చేశారంటూ బహిరంగ లేఖతో డైరెక్టర్ గుణశేఖర్ అటాక్ చేయడంతోపాటు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆవేదన బయటపెట్టాడు.

ఇలాంటి టైంలో గుణశేఖర్ సోషల్ మీడియాలో సడెన్ గా తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్.టి.రామారావు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ మధ్య సీనియర్ డైరెక్టర్ మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి ఇది నా కథ పేరుతో తన జీవిత చరిత్ర రాశారు. ఇందులో గుణశేఖర్ తనకు ఎలా పరిచయమైంది.. ఆ పరిచయం ఎలా పెరిగింది రాసుకొచ్చారు. కెరీర్ లో పైకెదిగాక గుణశేఖర్ తన పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించాడని డైరెక్ట్ గానే రాశారు. ఇదే పుస్తకంలో తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్.టి.రామారావు తన ఖర్చులన్నీ ఎదుటివారి నెత్తిన వేసేవారంటూ ఓ ఆర్టికల్ కూడా రాశారు. తనగురించి మల్లెమాల రాసిన పేజీలను.. అండర్ లైన్ చేసి మరీ షేర్ చేసిన గుణశేఖర్ ‘‘ఈ నిందల్ని నిజం అని కొందరు ‘తమ్ముళ్ళు’ సమర్ధించవచ్చేమో గానీ, ఇదే పుస్తకంలో ‘అన్నగారి’పై వచ్చిన నిందల్ని నేను ఏమాత్రం నిజమని సమర్ధించను’’ అంటూ చిన్నపాటి చురక వేశాడు.

ఇంతవరకు తన సినిమా గురించో.. అవార్డుల గురించో మాట్లాడిన గుణశేఖర్ ఉన్నట్టుండి ఎన్టీఆర్ ను ఎందుకు అటాక్ చేస్తున్నాడో అభిమానులకు ఓ పట్టాన అర్ధం కాలేదు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ ఓ కొత్త స్టయిల్లో కౌంటర్ ఇస్తున్నాడని అర్ధమై ఫ్యాన్స్ కూడా తిరిగి కామెంట్లతో ఎదురుదాడి మొదలెట్టారు.