Begin typing your search above and press return to search.

గౌతమ్ మీనన్ పెద్ద సాహసమే చేశాడు

By:  Tupaki Desk   |   24 Nov 2015 3:30 PM GMT
గౌతమ్ మీనన్ పెద్ద సాహసమే చేశాడు
X
దాదాపు రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు - దర్శకుడు బాలచందర్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇళయరాజా రీరికార్డింగ్ లేట్ చేయడంతో ఆయన పాత సినిమాల్లోని ఆర్.ఆర్.నే వాడుకుని తనే సొంతంగా రీరికార్డింగ్ పూర్తి చేశాడు బాలచందర్. దీంతో ఒళ్లు మండిన ఇళయరాజా మళ్లీ బాలచందర్ తో పని చేయలేదు. తాను నిర్మించిన ‘రోజా’ సినిమాకు మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడైన ఇళయరాజాను కాదని పట్టుబట్టి రెహమాన్ తో మ్యూజిక్ చేయించాడు బాలచందర్. ఈ కోపంతో మళ్లీ ఇళయరాజా బాలచందర్ తో కానీ మణిరత్నంతో కానీ పని చేయలేదు. వాళ్లూ ఆసక్తి చూపలేదు.

ఐతే ఇళయరాజా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా అంత పేరు, గౌరవం సంపాదించుకున్న రెహమాన్ కూడా తన పనిలో ఎవరైనా వేలు పెడితే అస్సలు ఊరుకోరని సమాచారం. తాను సంగీత దర్శకుడిగా పని చేసే సినిమాల్లో దర్శకుడి జోక్యం ఎక్కువైతే అస్సలు సహించరట. ఐతే రెహమాన్ మనసు నొప్పించకుండానే అతడి ప్రమేయం లేకుండా ‘సాహసం శ్వాసగా సాగిపో’ టీజర్ వదిలి తన ప్రత్యేకత చాటుకున్నాడట డైరెక్టర్ గౌతమ్.

నిజానికి నిన్న నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ టీజర్ కి రెహమాన్ వర్క్ చేయలేదట. ఆయన ఫారిన్ లో బిజీగా ఉండటంతో ఇందుకు అవకాశం లేకపోయింది. ఐతే చైతూ బర్త్ డేకి టీజర్ రిలీజ్ చేయక తప్పని పరిస్థితి రావడంతో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు అందించిన మ్యూజిక్ బిట్ తీసుకుని.. తన వాయిస్, చైతూ వాయిస్ యాడ్ చేసి ఈ టీజర్ కి మ్యూజిక్ తనే కానిచ్చేశాడట గౌతమ్. ఐతే ఇదంతా రెహమాన్ అనుమతితోనే సాగిందని సమాచారం.