Begin typing your search above and press return to search.

గోపీచంద్ సినిమాతో పవన్‌ కు సంబంధమేంటి?

By:  Tupaki Desk   |   23 April 2017 10:39 AM GMT
గోపీచంద్ సినిమాతో పవన్‌ కు సంబంధమేంటి?
X
గత కొన్నేళ్లో హీరో గోపీచంద్ కు ‘లౌక్యం’ మినహా సరైన సక్సెస్ లేదు. ‘లౌక్యం’తో గాడిన పడ్డట్లే కనిపించిన గోపీ.. మళ్లీ ‘సౌఖ్యం’తో దెబ్బ తిన్నాడు. ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడిపోదామని వెంటనే ‘ఆక్సిజన్’ సినిమాను మొదలుపెట్టాడు కానీ.. అది ఓ దశ దాటాక ముందుకు కదల్లేదు. మరోవైపు ఎప్పట్నుంచో పెండింగులో ఉన్న బి.గోపాల్ సినిమాను బయటికి తేవాల్సిన బాధ్యత అతడిపై పడింది. మరోవైపు సంపత్ నంది సినిమా ‘గౌతమ్ నంద’ సంగతేంటో కూడా తేల్చాల్సి ఉంది. ఈ మూడు సినిమాలనూ రాబోయే మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు గోపీ.

విశేషం ఏంటంటే ఈ మూడు సినిమాలకూ పవన్ కళ్యాణ్ తో లింకు ఉండటం విశేషం. సంపత్ నంది సినిమాకు టైటిల్.. పవన్ మూవీ ‘అత్తారింటికి దారేది’ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పవన్ పేరు గౌతమ్ నంద అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్ మీద తనకున్న అభిమానంతో సంపత్ తన సినిమాకు ఆ పేరు పెట్టుకున్నాడు. ఇక బి.గోపాల్ సినిమాకు టైటిల్ గా పెట్టుకున్న ‘ఆరడుగుల బుల్లెట్’ అన్నది కూడా ‘అత్తారింటికి దారేది’లోని ఓ పాట నుంచి తీసుకున్నదే. ఇక గోపీ నుంచి రాబోయే మూడో సినిమా ‘ఆక్సిజన్’కు పవన్ తో ఇన్ డైరెక్ట్ లింక్ ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎం.రత్నమే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. కాకపోతే మధ్యలో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ‘ఆక్సిజన్’ను బయటపడేయలేని స్థితికి చేరుకున్నారు. ఐతే పవన్ సినిమా ముందుకు కదిలితే.. ‘ఆక్సిజన్’ బయటపడే అవకాశముంది. ఈ రకంగా గోపీ మూడు సినిమాలతోనూ పవన్ కు లింకు ఏర్పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/