Begin typing your search above and press return to search.

ఆక్సిజన్.. కొత్త డేట్ ఇచ్చారండోయ్..

By:  Tupaki Desk   |   24 Nov 2017 4:28 AM GMT
ఆక్సిజన్.. కొత్త డేట్ ఇచ్చారండోయ్..
X
ఇప్పటిదాకా ఐదుసార్లు ‘ఆక్సిజన్’ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఆగస్టు 18 మొదలుకుని.. నవంబరు 17 వరకు మళ్లీ మళ్లీ రిలీజ్ డేట్ మారుస్తూ పోయారు. ప్రతిసారీ కొత్తగా రెండు పోస్టర్లు రిలీజ్ చేయడం.. కొత్త రిలీజ్ డేట్ చెప్పడం.. కొన్నాళ్ల తర్వాత చప్పుడే లేకపోవడం.. సినిమా వాయిదా అంటూ సమాచారం రావడం.. ఇదే వరుస అయిపోయింది. నవంబరు 17న పక్కా అని చెప్పి.. ఆ తేదీకి కూడా సినిమా తీసుకురాకపోవడంతో దీనిపై ఆశలు వదిలేసుకున్నారు ప్రేక్షకులు. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. సినిమాకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబరు 30న ‘ఆక్సిజన్’ను రిలీజ్ చేయబోతున్నట్లు మీడియాకు ఫీలర్స్ వదిలి.. రెండు కొత్త పోస్టర్లు లాంచ్ చేశారు.

ఈ నెల అంతా ప్రతి వారం ఇబ్బడిముబ్బడిగా సినిమాలు వస్తున్నాయి. ఈ వారంతో కలిపితే 20 సినిమాల దాకా రిలీజైనట్లు లెక్క. చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోని చాలా సినిమాల్ని ఈ నెలలోనే రిలీజ్ చేశారు. ఈ కోవలోనే ‘ఆక్సిజన్’ను కూడా లాగించేస్తారేమో చూడాలి. ఈ నెల 30న తమిళ డబ్బింగ్ సినిమా ‘ఇంద్రసేన’ రిలీజవుతుండగా.. మరుసటి రోజు సాయిధరమ్ తేజ్ మూవీ ‘జవాన్’ రిలీజవుతోంది. వీటిపై బజ్ బాగానే ఉంది. మరి ఈ సినిమాల మధ్య ‘ఆక్సిజన్’ను నిజంగానే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. గోపీచంద్.. రాశీ ఖన్నా.. అను ఇమ్మాన్యుయెల్ కీలక పాత్రల్లో జ్యోతికృష్ణ రూపొందించిన ఈ చిత్రాన్ని అతడి తండ్రి ఎ.ఎం.రత్నం నిర్మించాడు.