Begin typing your search above and press return to search.

ఆ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియదు-గోపీ

By:  Tupaki Desk   |   22 July 2017 5:45 PM GMT
ఆ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియదు-గోపీ
X
యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ ను పెద్ద సందిగ్ధంలోకి నెట్టేశాయి రెండు సినిమాలు. అందులో ఒకటి ‘ఆరడుగుల బుల్లెట్’ అయితే.. ఇంకోటి ‘ఆక్సిజన్’. వీటిలో ‘ఆరడుగుల బుల్లెట్’ మీద ఎలాంటి ఆశల్లేవు. అది ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలైన సినిమా. ఈ మధ్య రిలీజ్ డేట్ కూడా ఇచ్చాక.. విడుదల రోజు తలెత్తిన ఫైనాన్స్ వివాదాలతో అది మరుగున పడిపోయింది. కానీ ఎ.ఎం.రత్నం లాంటి అగ్ర నిర్మాత ప్రొడ్యూస్ చేసిన ‘ఆక్సిజన్’ సంగతి ఎటూ తేలకపోవడమే ఆశ్చర్యం. ఆగస్టు మధ్యలో ఈ సినిమా విడుదలవుతుందంటూ ఇటీవలే ఓ ప్రకటన వచ్చింది. ఐతే హీరో గోపీచంద్ మాత్రం ఈ సినిమా విడుదల ఎప్పుడో ఏంటో తనకూ తెలియదంటున్నాడు.

తన కొత్త సినిమా ‘గౌతమ్ నంద’ ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన గోపీకి ‘ఆక్సిజన్’కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి అతను బదులిస్తూ.. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం సామాన్య ప్రేక్షకుల్లాగే తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ కూడా మిగిలి ఉందని అతను వెల్లడించాడు. తన సినిమా విషయంలో హీరోనే ఇలా నిస్సహాయంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘ఆక్సిజన్’కు రత్నం తనయుడు జ్యోతికృష్ణే దర్శకుడన్న సంగతి తెలిసిందే. అతడితో గోపీకి విభేదాలు తలెత్తాయని.. అందుకే సినిమా అర్ధంతరంగా ఆగిందని వార్తలొచ్చాయి. గోపీ మాటల్ని బట్టి చేస్తుంటే ఏదో తేడా ఉన్న మాట వాస్తవమే అనిపిస్తోంది.