‘బుల్లెట్’కు మోక్షం కలగడం కష్టమే

Mon Jun 19 2017 15:25:58 GMT+0530 (IST)

ఏళ్లకు ఏళ్లుగా పక్కన పడి ఉన్న ‘ఆరడుగుల బుల్లెట్’ను లేక లేక ఈ మధ్యే బయటికి తీసుకొచ్చారు. పొట్లూరి వరప్రసాద్ ఓ పది కోట్ల దాకా సాయం చేయడంతో కొన్ని ఫైనాన్సులు క్లియర్ చేసి.. ఫైనల్ టచప్స్ ఏవో చేసి.. ఎలాగోలా సినిమాను విడుదలకు ముస్తాబు చేశారు. కానీ తీరా విడుదలకు అంతా సిద్ధమయ్యాక పడింది బ్రేక్. ఈ నెల 9న అనుకున్న ప్రకారం సినిమా విడుదల కాలేదు. తాను ఈ సినిమా కోసం ఇచ్చిన రూ.6 కోట్ల ఫైనాన్స్ సంగతి తేలిస్తే తప్ప సినిమా విడుదల కానివ్వబోనంటూ ఓ ఫైనాన్షియర్ కేసు పెట్టడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాలేమీ నిర్మాతలు చేస్తున్నట్లు లేదని సమాచారం.

మామూలుగా సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి వివాదాలు తలెత్తితే మధ్య వర్తుల్ని పెట్టుకుని డబ్బుల విషయంలో హామీ మేరకు సినిమా విడుదలయ్యేలా చూసుకుంటారు. సినిమా రిలీజవడం అన్నిటికంటే ముఖ్యం కాబట్టి వెంటనే డీల్స్ అయిపోతుంటాయి. కానీ ‘ఆరడుగుల బుల్లెట్’ పరిస్థితి చూసి దాని విషయంలో మధ్యవర్తిత్వం నడపడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై నిర్మాత పెట్టిన పెట్టుబడిని వదులుకునే పరిస్థితిలో ఉన్నాడు. సినిమా నుంచి ఏమైనా వచ్చినా అది పీవీపీ ఖాతాలోకే వెళ్లాల్సి ఉంది. సినిమా రిలీజ్ అయితే ఆయన పెట్టిన రూ.10 కోట్ల మొత్తమైనా తిరిగి వస్తుందా అన్న సందేహలున్నాయి. అలాంటిది ఇంకో ఆరు కోట్ల మొత్తానికి హామీ ఇచ్చే పరిస్థితి లేదు. సినిమా రిలీజై వసూలు చేసే మొత్తంలో పీవీపీకి రూ.10 కోట్లిచ్చి.. మిగతా రూ.6 కోట్లు కూడా సెటిల్ చేయడం అన్నది అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ దిశగా అడుగులేమీ ముందుకు పడట్లేదు. మరి అన్ని వివాదాలు సెటిలై ఇప్పుడిప్పుడే సినిమా విడుదల కావడం అన్నది కష్టమే అనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/