టీజర్ టాక్: ధైర్యానికి.. పోరాటానికి పీక్స్

Tue Feb 12 2019 19:47:06 GMT+0530 (IST)

అమీర్ ఖాన్ తర్వాత విభిన్న కథాంశాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. తాజాగా అక్షయ్ తన కొత్త సినిమా 'కేసరి' టీజర్ తో మనముందుకు వచ్చాడు. 1897 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ సారగడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  టీజర్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.  కిరాతకంగా ఉండే 10000 మంది ఆఫ్ఘన్ తెగవారు బ్రిటిష్ ఇండియా(ఇప్పుడు పాకిస్తాన్) పై దాడిచేసినప్పుడు 21 మంది సిక్కులైన బ్రిటిష్ ఇండియన్ సైనికులు వారిని అడ్డుకుంటారు. చావనైనా చావాల్సిందే గానీ వారిని అడ్డుకోవాలని పోరాడి ప్రాణత్యాగం చేస్తారు.ఈ సంఘటన నేపథ్యంగా తెరకెక్కిన సినిమానే 'కేసరి'. గ్లింప్స్ ఆఫ్ కేసరి-పార్ట్ 1 ..  గ్లింప్స్ ఆఫ్ కేసరి-పార్ట్ 2 అంటూ రెండు టీజర్లు విడుదల చేశారు.  మొదటి టీజర్లో ఆఫ్ఘాన్ తెగవారు గుంపుగా దాడికి వస్తూ ఉంటే అక్షయ్ కుమార్ ఎడమ చేత్తో ఒక రింగ్ లాంటి పదునైన ఆయుధం.. కుడి చేత్తో కొలిమిలో కాల్చిన పొడవాటి కత్తి పట్టుకొని దాడికి సిద్దం అన్నట్టుగా కనిపిస్తాడు. మొహం చూపలేదు గానీ.. ఆయుధాలు చూస్తూ.. ఆ నేపథ్య సంగీతం వింటేనే ఒకలాంటి ఊపు వస్తుంది.

మరో టీజర్లో ఒళ్లంతా మంటల్లో కాలుతున్నా తొణకక బెణకక శత్రువుల ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి తన కుడి చేతిని పైకెత్తి పిడికిలి బిగిస్తాడు.  ఈ తెగింపు చూసి తట్టుకోలేక ఆఫ్ఘాన్ తెగ మనుషులు వారిలో వారు గుసగుసలాడుతూ కనిపిస్తారు. ఫుల్ గా యాక్షన్ సీక్వెన్సులకు హై ఎమోషన్స్ కు అవకాశం ఉండే కాన్సెప్ట్ కాబట్టి ఆడియన్స్ ను చూపు తిప్పుకోవడం కూడా కష్టమే.  ఈ సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 21 న విడుదల చేస్తారని టీజర్లోనే ప్రకటించారు.

అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ - కేప్ గుడ్ ఫిలిమ్స్ - అజూర్ ఎంటర్టైన్మెంట్ - జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించారు.  మార్చ్ 21 న ఈ సినిమాను విడుదల చేస్తారు.  'కేసరి' రెండు టీజర్లను ఒక చూపు చూడండి బాబులు..పాపలు!