Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: జెంటిల్ మన్

By:  Tupaki Desk   |   17 Jun 2016 10:07 AM GMT
మూవీ రివ్యూ: జెంటిల్ మన్
X
చిత్రం : ‘జెంటిల్ మన్’

నటీనటులు: నాని - నివేదా థామస్ - సురభి - అవసరాల శ్రీనివాస్ - ఆనంద్ - తనికెళ్ల భరణి - వెన్నెల కిషోర్ - సత్యం రాజేష్ - రోహిణి - మధునందన్ - ప్రగతి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.జి.విందా
కథ: డేవిడ్ నాథన్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
కథా విస్తరణ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

‘అష్టాచెమ్మా’ సినిమాతో హీరోగా నాని.. దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్లో ‘జెంటిల్ మన్’ తెరకెక్కింది. హీరోగా మాంచి ఊపులో ఉన్నప్పటికీ.. ఫామ్ లో లేని ఇంద్రగంటితో జట్టు కట్టి ఆశ్చర్యపరిచాడు నాని. ఐతే ఇందుకు కథ మీద ఉన్న నమ్మకమే కారణమని అన్నాడు నాని. ఇంద్రగంటి కూడా ఈ కథ గురించి.. నాని పాత్ర గురించి చాలా చెప్పాడు. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జెంటిల్ మన్’లో అంత ప్రత్యేకత ఏముందో చూద్దాం పదండి.

కథ:

కేథరిన్ (నివేదా థామస్).. ఐశ్వర్య (సురభి) ఓ విమాన ప్రయాణంలో ఒకరికొకరు పరిచయమవుతారు. తమ ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. కేథరిన్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ తో తన లవ్ స్టోరీ గురించి చెబితే.. తనకు కాబోయే వాడైన జై గురించి వివరిస్తుంది. ఈ జర్నీ ముగిసిపోయాక ఎయిర్ పోర్టులో ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జైని చూసి కేథరిన్ ఆశ్చర్యపోతుంది. అతను తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ లాగే ఉంటాడు. తర్వాత గౌతమ్ ఇంటికెళ్తే అతను చనిపోయడని తెలుస్తుంది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల జైయే గౌతమ్ ను చంపేశాడని అనుమానిస్తుంది కేథరిన్. మరి జై నిజంగా హంతకుడా.. గౌతమ్ ఏమయ్యాడు.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

థ్రిల్లర్.. యూనివర్శల్ అప్పీల్ ఉన్న జానర్. ఇది ఎప్పటికీ ఔట్ డేట్ కాని జానర్ కూడా. ఐతే తెలుగులో థ్రిల్లర్లు అరుదు. అప్పుడప్పుడూ ఈ జానర్లో ఒకటీ అరా సినిమాలు వస్తుంటాయి కానీ.. మెయిన్ స్ట్రీమ్ హీరోలు కానీ.. దర్శకులు కానీ ఈ జానర్ టచ్ చేయడం తక్కువ. చేసినా అవి విజయవంతమైన దాఖలాలు ఇంకా తక్కువ. ఐతే ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు.. నాని లాంటి టాలెంటెడ్ నటుడు కలిసి ‘జెంటిల్ మన్’తో ఆ లోటు తీర్చే ప్రయత్నం చేశారు. తెలుగులో వచ్చిన అతి కొద్ది డీసెంట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘జెంటిల్ మన్’ ఒకటి.

హీరోనా.. విలనా... అంటూ ప్రశ్నిస్తూ ‘జెంటిల్ మన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల్ని గెస్సింగ్ లో ఉంచడానికి ప్రయత్నించాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సినిమాలో సైతం ప్రేక్షకుడికి హీరో పాత్ర మీద సందేహాలు రేకెత్తించి.. చివరిదాకా గెస్సింగ్ లో ఉండేలా చేయడంలో ఓ మోస్తరుగా విజయవంతం అయ్యాడతను. మరీ థ్రిల్ చేసేశాడని చెప్పలేం కానీ.. కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా నడిపించాడు. తాను తొలిసారి ప్రయత్నించిన జానర్లో పట్టు చూపిస్తూ.. ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంతో పాటు తన గత సినిమాల్లోని సెన్సిబుల్ హ్యూమర్ ను ఇందులో మిస్ కాలేదు ఇంద్రగంటి. కాకపోతే ఇంద్రగంటి మార్కు స్లో నరేషనే సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్.

ఇప్పటిదాకా మనం చూసిన ఇంద్రగంటి సినిమాలకు ‘జెంటిల్ మన్’ భిన్నమైంది. అలాగే నాని కూడా ఇందులో కొత్తగా కనిపిస్తాడు. అవ్వడానికిది బేసిగ్గా ఇది థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ.. కథనం చాలా వరకు ప్లెజెంట్ గా.. వినోదాత్మకంగా నడిపించడానికే ప్రయత్నించాడు ఇంద్రగంటి. అలాగని థ్రిల్లర్ ఫ్లేవర్ కూడా పోలేదు. థ్రిల్లర్ సినిమాల్లో రొమాన్స్.. కామెడీ.. ఇమడవు అనడానికేమీ లేదని ‘జెంటిల్ మన్’ చూస్తుంటే అర్థమవుతుంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వరకు కథనం ఏ అలజడీ లేకుండా.. ఆహ్లాదంగా.. వినోదాత్మకంగా సాగిపోతుంది. ఇద్దరు కథానాయికలతో హీరో వేర్వేరు లవ్ ట్రాక్ లను ఇంద్రగంటి చాలా సింపుల్ గా నరేట్ చేసి ప్రథమార్ధాన్ని తెలివిగా పాస్ చేయించేశాడు. లవ్ స్టోరీల్లో కథనం నెమ్మదిగా సాగుతున్న భావన కలిగినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టే అవకాశమైతే లేదు. ఇంద్రగంటి మార్కు చమక్కులు.. నాని నటన ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్. ఇక్కడి నుంచే ఇంద్రగంటి.. ప్రేక్షకుల్ని థ్రిల్లర్ మూడ్లోకి తీసుకెళ్తాడు. ద్వితీయార్ధంలో మధ్య మధ్యలో కొంచెం డీవీయేట్ అయినట్లు కనిపించినా.. చివరిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో ఇంద్రగంటి సక్సెస్ అయ్యాడు.

హీరో.. నిజంగా విలనా కాదా అనే విషయంలో ప్రేక్షకులు అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. ట్విస్టు తాలూకు లైన్ ఏంటన్నది గెస్ చేసేయొచ్చు. అయినా చివరిదాకా ఆసక్తిగా చూసేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ కామెడీ బాగానే వినోదాన్ని పంచుతుంది. ఐతే థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్లిపోయాక మళ్లీ కామెడీ మీద దృష్టి పెట్టడం వల్ల కథనం పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంద్రగంటి ఇంకాస్త వేగంగానూ కథనాన్ని నడపించాల్సింది కూడా. ద్వితీయార్ధంలో నాని పాత్ర కొంత సమయం వరకు బ్యాక్ సీట్ తీసుకుంటే నివేదా.. వెన్నెల కిషోర్ లాంటి వాళ్లే హైలైట్ అవుతుంటారు. ఐతే చివరి అరగంటలో మళ్లీ నాని తెరమీదికి వచ్చి కథనాన్ని తన భుజాల మీద నడిపిస్తాడు.

చివర్లో హీరో రివీల్ చేసే ట్విస్టు పర్వాలేదనిపిస్తుంది తప్ప మరీ థ్రిల్ చేయదు. ట్విస్టు రివీలయ్యాక కొసమెరుపులా ఏదైనా ఉంటే దీనికి పర్ఫెక్ట్ ఎండింగ్ లాగా ఉండేదేమో. ఇంద్రగంటి అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం.. ఒకడి ప్లేస్ లోకి ఇంకొకడు రావడం.. మళ్లీ వాళ్లిద్దరి ప్రియురాళ్లు కూడా కలుసుకోవడం.. ఇలాంటి కోయిన్సిడెన్సెస్ ఎక్కువైపోయాయి. థ్రిల్లర్ సినిమాలకు తగ్గట్లు ఇంకాస్త వేగంగా చూపించాల్సింది. స్లో నరేషన్ అవల్ల అక్కడక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వరకు ‘జెంటిల్ మన్’తో బాగానే కనెక్టవుతారు కానీ.. ‘భలే భలే మగాడివోయ్’ తరహాలో ఇది అందరినీ అలరించే సినిమాగా నిలుస్తుందా అన్నది సందేహమే. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారన్నదాన్ని బట్టి ‘జెంటిల్ మన్’ రేంజేంటన్నది ఆధారపడి ఉంటుంది.

నటీనటులు:

ప్రి క్లైమాక్స్ లో తాను ఎవరో హీరోయిన్ కు చెప్పే సన్నివేశంలో ఎమోషనల్ అయ్యే ఒక్క సన్నివేశం చాలు నాని ఏంటో చెప్పడానికి. ఆ సన్నవేశంలో నాని నటన ‘వావ్’ అనిపిస్తుంది. నాని టాలెంట్ ఏంటో చూపించే చాలా సన్నివేశాలున్నాయిందులో. ఇలాంటి సినిమా ఎంచుకోవడంలో నాని అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాతో నాని మరింతగా తెలుగు ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోతాడనంలో సందేహం లేదు. ఐతే జై పాత్ర ప్రాణాలతో పోరాడే సన్నివేశంలో మాత్రం నాని నటన కొంచెం అతకనట్లు కనిపిస్తుంది. హీరోయిన్ నివేదా థామస్ బలమైన ముద్ర వేస్తుంది. నివేదా మంచి నటి అనే విషయం తొలి సన్నివేశంలో ఆమె హావభావాలు చూస్తేనే తెలిసిపోతుంది. తన ప్రియుడు ప్రాణాలతో లేడని తెలిసిన సన్నివేశంలో ఆమె నటన గుర్తుండిపోతుంది. సురభి పర్వాలేదు. అవసరాల శ్రీనివాస్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కనిపించినంత సేపూ నవ్వించాడు. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

మణిశర్మ ఔట్ డేట్ అయిపోయాడు అనుకునేవాళ్లందరూ ‘జెంటిల్ మన్’ చూస్తే లెంపలేసుకుంటారు. అవకాశం ఇస్తే ఆయన ఎంత గొప్ప ఔట్ పుట్ ఇస్తారో చెప్పడానికి ‘జెంటిల్ మన్’ సరైన రుజువు. తనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న కసో ఏంటో తన అభిమానులు కూడా ఆశ్చర్యపోయే పనితనం చూపించాడు మణిశర్మ. టైటిల్స్ పడేటపుడు బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గర్నుంచే మణి ప్రత్యేకత కనిపిస్తుంది. నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్. ప్రేమ సన్నివేశాల్లో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో.. మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో అంత ఉత్కంఠ రేపుతుంది. మణిశర్మ పాటలు కూడా బాగున్నాయి. మొత్తంగా ‘జెంటిల్ మన్’కు ఇంద్రగంటి.. నాని.. తర్వాత మేజర్ పిల్లర్ మణిశర్మే.

పి.జి.విందా ఛాయాగ్రహణం కూడా టాప్ క్లాస్ అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో విందా విజయవంతమయ్యాడు. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్సయ్యాయి. ఇక ఇంద్రగంటి రచయితగా.. దర్శకుడిగా.. రెండు రకాలుగానూ పనితనం చూపించాడు. ఇంద్రగంటిలో ఇప్పటిదాకా మనం చూడని కొత్త కోణాలు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇటు వినోదాన్ని.. అటు థ్రిల్లర్ అంశాల్ని బ్లెండ్ చేసిన తీరుకు ఇంద్రగంటిని అభినందించాలి. స్క్రిప్టు మీద అతడి కమాండ్ సినిమా అంతటా కనిపిస్తుంది. కాకపోతే నరేషనే కొంచెం స్లో అనిపిస్తుంది. ‘‘అన్నీ విప్పమంటే ప్రాబ్లెం లేదు.. సగం సగం విప్పమంటేనే షైగా ఉంటుంది’’.. ‘‘మనకు డైటింగ్ లాంటి మూడ నమ్మకాలేమీ లేవనుకుంటా’’ లాంటి ఫన్నీ రొమాంటిక్ డైలాగుల్లో ఇంద్రగంటి ముద్ర కనిపిస్తుంది.

చివరగా: జెంటిల్ మన్.. డీసెంట్ థ్రిల్లర్

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre