సింగర్ కి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్

Tue Jun 12 2018 15:49:10 GMT+0530 (IST)

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మొదలైన బిగ్ బాస్ 2 ఎలా రన్ అవుతుందో రెండు రోజులకే జడ్జ్ చేయటం భావ్యం కాదు కనక దానికి సంబంధించిన ఇతర విషయాల మీద ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. 16 పార్టిసిపెంట్స్ లో అందరు కాకపోయినా కొందరు మాత్రం ప్రత్యేకంగా మన దృష్ఠిని ఆకర్షిస్తున్నారు. అందులో ప్లే బ్యాక్ సింగర్ గీతా మాధురి ఒకరు. గాయనిగా బిజీగా ఉన్న టైంలో ఏకంగా 100 రోజుల పాటు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండాలి అంటే దానికి తగ్గ పారితోషికం ముట్టాలిగా. అదే జరిగింది మరి. బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ కావడం అనేది ముందే ఊహించేది కాదు కనక కొందరికి రోజు వారి రెమ్యునరేషన్ మాట్లాడుకుంటే మరికొందరికి ఫుల్ ప్యాకేజ్ డీల్ చేసుకుంటారు. గీతా మాధురి రెండో క్యాటగిరీలో వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా తను చివరి దాకా ఉన్నా లేక మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చినా దానితో సంబంధం లేకుండా హోల్ సేల్ ప్యాకేజీ కింద 20 లక్షలు ఒప్పందం చేసుకున్నట్టు వచ్చిన వార్త ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఇలాంటివి అధికారికంగా ధృవీకరించే అవకాశం లేదు కానీ న్యూస్ అయితే నిజమే అంటున్న వారు లేకపోలేదు. సింగర్ గా ఈ మూడు నెలలు తనకు వచ్చే అవకాశాలు దూరమవుతాయి కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించి గీతా మాధురి ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు వినికిడి. తను నెలకు బయటికి వచ్చినా లేదా పూర్తిగా వంద రోజులు బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నా దక్కే మొత్తంలో మాత్రం తేడా రాదు. ఇదేదో బాగుంది కదూ. ఒకవేళ గెలిస్తే మాత్రం ప్రైజ్ మనీ అదనం. ఇక పబ్లిసిటీ గురించి చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ డీల్ చేసిన లాస్ట్ సీజన్ లో బయట ప్రపంచానికి తెలియని కొందరు అది పూర్తవ్వగానే పాపులర్ సెలెబ్రిటీలు కావడం అబద్దం కాదు. అందుకే కెరీర్ పరంగా కొంచెం రిస్క్ అయినా గీతా మాధురి ఇందులో పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి యాంకర్ శ్యామలకు ఎంతిచ్చారు అనే చర్చ కూడా జరుగుతోంది కానీ లెక్క ఇంకా లీక్ కాలేదు. మొత్తానికి బిగ్ బాస్ డబ్బుతో పాటు బయటికి వచ్చాక కావాల్సినంత పాపులారిటీ కూడా ఇచ్చేస్తోంది. అందుకేగా ఇంత డిమాండ్.