'గీత గోవిందం'కి అక్కడ అంత క్రేజా?

Wed Aug 15 2018 10:31:56 GMT+0530 (IST)

బుధవారం రిలీజవుతున్న ‘గీత గోవిందం’కి ఎంత క్రేజ్ ఉందన్నది కొన్ని రోజుల ముందు నుంచే అందరూ చూస్తున్నారు. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజవుతున్నట్లు అనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే చివరగా వేసవిలో వచ్చిన భారీ సినిమా ‘నా పేరు సూర్య’ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఆ స్థాయిలో జరుగుతున్నది ఈ చిత్రానికే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలోనూ ‘గీత గోవిందం’ కోసం మాంచి డిమాండ్ కనిపిస్తోంది. అక్కడ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ ‘మూవీ టికెట్స్.కామ్’లో టికెట్ల అమ్మకాలు అత్యధికంగా జరుగుతున్న సనిిమాల్లో ‘గీత గోవిందం’ రెండో స్థానంలో ఉండటం విశేషం. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి ఈ చిత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది.మంగళవారం ఒక రోజు వ్యవధిలో జరిగిన టికెట్ల అమ్మకాల ఆధారంగా చూస్తే హాలీవుడ్ మూవీ ‘ఓపెనింగ్ వైడ్’ 20.5 శాతంతో అగ్ర స్థానంలో ఉంటే.. ‘గీత గోవిందం’ 14 శాతంతో రెండో స్థానంలో ఉంది. ‘కిస్టఫర్ రాబిన్’.. ‘మిషన్ ఇంపాజిబుల్’.. ‘క్రేజీ’ సినిమాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘బాహుబలి’ తరహా సినిమాలు మాత్రమే గతంలో ఇలా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి టికెట్ల అమ్మకాల్లో టాప్-10లో నిలిచాయి. ‘గీత గోవిందం’ లాంటి మీడియం రేంజి సినిమా హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడటం చిన్న విషయం కాదు. మంగళవారం ఉదయానికే ‘గీత గోవిందం’ ప్రి సేల్స్ 1.5 లక్షల డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ఈ చిత్రం ప్రిమియర్ల ద్వారానే హాఫ్ మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లోపే మిలియన్ క్లబ్బులోకి కూడా చేరొచ్చు. ఫుల్ రన్లో 2 మిలియన్ మార్కును కూడా టచ్ చేయొచ్చు.