Begin typing your search above and press return to search.

బన్నీ స్థానం గొవింద.. గోవింద

By:  Tupaki Desk   |   23 Sep 2018 8:01 AM GMT
బన్నీ స్థానం గొవింద.. గోవింద
X
విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలై నాలుగు వారాలు దాటినా కూడా కలెక్షన్స్‌ పరంగా కొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం ఇంకా పలు ఏరియాల నుండి మంచి షేర్‌ ను రాబడుతూనే ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో విజయ్‌ దేవరకొండ ఒక ఊపు ఊపేస్తున్నాడు. కొందరు స్టార్‌ హీరోలకు సైతం సాధ్యం కాని 20 కోట్ల క్లబ్‌ లో చేరిపోయాడు.

‘గీత గోవిందం’ చిత్రం నాలుగు వారాలు పూర్తి అయ్యేప్పటికి 20. 20 కోట్లను వసూళ్లు చేసినట్లుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో 20 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించిన చిత్రాలు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. తాజాగా గీత గోవిందం ఆ జాబితాలో చేరడంతో ఆ సంఖ్య 8 కి చేరింది. ఇప్పటి వరకు 20.30 కోట్లతో అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే’ చిత్రం 7వ స్థానంలో ఉంది. 20.20 కోట్లతో ‘గీత గోవిందం’ చిత్రం 8వ స్థానంలో ఉంది. ఇంకా కూడా గీత గోవిందంకు షేర్‌ వస్తున్న కారణంగా మరికొన్ని రోజుల్లో ‘డీజే’ రికార్డును గీత గోవిందం బ్రేక్‌ చేసే అవకాశం ఉంది.

7వ స్థానంలో ఉన్న ‘డీజే’ చిత్రం అతి త్వరలోనే 8వ స్థానంకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. మరో పది లక్షల రూపాయల షేర్‌ ను రాబట్టడం ఏమంత పెద్ద కష్టం కాదు. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాల సందడి ఏమీ లేకపోవడంతో పాటు, ఉన్న చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలం అవుతున్న కారణంగా గీత గోవిందం చిత్రం లాంగ్‌ రన్‌ లో మరో 25 లక్షల వరకు షేర్‌ ను దక్కించుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ ట్రేడ్‌ పండితులు అంటున్నారు. అదే జరిగితే నైజాం ఏరియా కలెక్షన్స్‌ లో ఆరవ స్థానంలో ఉన్న శ్రీమంతుడు మరియు అయిదవ స్థానంలో ఉన్న మగధీర చిత్రాల రికార్డులకు కూడా ఎసరు వచ్చే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తుంది.