Begin typing your search above and press return to search.

చిరు 151.. ఆ బేనర్లోనే పక్కా

By:  Tupaki Desk   |   25 Aug 2016 11:30 AM GMT
చిరు 151.. ఆ బేనర్లోనే పక్కా
X
మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూసుకోవాలన్న అభిమానుల కల ఇంకొన్ని నెలల్లోనే నెరవేరబోతోంది. చిరు 150వ సినిమా షూటింగ్ మొదలై రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే 50 శాతం షూటింగ్ అవగొట్టేసిన వి.వి.వినాయక్ శరవేగంగా సినిమాను పూర్తి చేసేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారమే 2017 జనవరి 13న ‘ఖైదీ నంబర్ 150’ ప్రేక్షకుల ముందుకు రావడం గ్యారెంటీ. మరి దాని తర్వాతేంటి..? చిరు తర్వాత ఏ సినిమా చేస్తాడు.. ఎవరితో చేస్తాడు.. అన్న ప్రశ్నలు ఇప్పటికే చర్చనీయాంశం అవుతున్నాయి. రీఎంట్రీ మూవీ కాబట్టి అనేక తర్జనభర్జనలు నడిచాయి. ఏళ్లకు ఏళ్లు నాన్చాల్సి వచ్చింది. ఒకసారి అడుగు పడిపోయాక.. ఇక ఇబ్బందేమీ ఉండదు.

150 తర్వాత వరుసగా చిరు సినిమాలు చేస్తాడనే ఆశిస్తున్నారు అభిమానులు. ఐతే 151వ సినిమా విషయంలో దర్శకుడెవరు అన్నది ఇంకా ఖరారవ్వలేదు కానీ.. బేనర్ మాత్రం ఓకే అయిపోయింది. తనకు అత్యంత కలిసి వచ్చిన బేనర్ ‘గీతా ఆర్ట్స్’లోనే చిరు తన తర్వాతి సినిమా చేయాలనుకుంటున్నారు. చిరు 151వ సినిమా తమ బేనర్లోనే ఉంటుందని గీతా ఆర్ట్స్ వర్గాలు స్పష్టం చేశాయి. దర్శకుడిగా బోయపాటి శ్రీను ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. బోయపాటితో పని చేయడంపై చిరు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించాడు. గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఇప్పటికే ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న బోయపాటి.. చిరు ఖాళీ అయ్యే సమయానికి ఫ్రీ అవుతాడని భావిస్తున్నారు. మరోవైపు చిరుతో ఛాన్స్ అందుకున్నట్లే కనిపించి చేజార్చుకున్న పూరి జగన్నాథ్ సైతం లైన్లో ఉన్నాడు. మరి చిరు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.