సినిమా కంటే భారీ గా సీరియల్ జయ

Wed Dec 19 2018 07:00:01 GMT+0530 (IST)

తమిళనాట అమ్మ గా సుప్రసిద్ధి చెంది ముఖ్యమంత్రి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయలలిత మరణం తర్వాత ఆవిడ బయోపిక్ తీసేందుకు చాలా మంది ప్రయత్నించారు కానీ వెంటనే ఏవీ కార్యరూపం దాల్చలేకపోయాయి. ఇటీవలే నిత్య మీనన్ టైటిల్ రోల్ లో ది ఐరన్ లేడీ అనే పేరుతో ప్రియదర్శని అనే దర్శకుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. సినిమా పక్కా కానీ పోస్టర్ లో ఉన్న లుక్ నిజమా మార్ఫింగా అనేది ఇంకా తేలలేదు.ఇదిలా ఉండగా ప్రియదర్శిని కంటే ముందు జయ కథను మూవీగా తీయాలని సీనియర్ దర్శకుడు భారతి రాజా కూడా అనుకున్నారు కానీ చివరికి అంత సాహసం చేయలేకపోయారు. కానీ గౌతమ్ మీనన్ మాత్రం మరో రూపంలో జయ చరిత్ర ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చెన్నై మీడియా టాక్. అయితే అది సినిమా రూపంలో కాదు. 30 ఎపిసోడ్ల పాటు సాగే టీవీ సీరియల్ గా రూపొందిస్తారట. టెలికాస్ట్ అయ్యాక ఏదైనా ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులో ఉంచుతారు. దీంట్లో జయగా ఎవరు నటిస్తారు అనేగా మీ అనుమానం.

శివగామి రమ్యకృష్ణ ను ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. భారీగా సినిమా స్థాయికి ఏ మాత్రం తీసిపోని రీతిలో సీనియర్ యాక్టర్స్ ఇందులో నటిస్తారట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీని ప్రసారం ఉండొచ్చని వినికిడి. ది ఐరన్ లేడీ కంటే ముందే ఇది జనంలోకి వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందని వార్త. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తారా లేక నిర్మాత గా ఉంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు