Begin typing your search above and press return to search.

గాంధీ బ‌యోపిక్‌.. గాడ్సే కోణంలోనా?

By:  Tupaki Desk   |   21 May 2019 9:21 AM GMT
గాంధీ బ‌యోపిక్‌.. గాడ్సే కోణంలోనా?
X
మ‌హాత్మ గాంధీజీ ని చంపిన‌ది ఎవ‌రు? హిస్ట‌రీలో గాంధీజీని వ్య‌తిరేకించిన‌ది ఎవ‌రు? ఆ ఇద్ద‌రి కోణంలో గాంధీని చూసుకునే వీలుందా? అది కూడా పెద్ద తెర‌పైన‌!! ఇప్ప‌టివ‌ర‌కూ గాంధీ జీవితాన్ని గాడ్సే.. జిన్నా కోణంలో ఎవ‌రూ సినిమా తీయ‌లేదు. అయితే ఈసారి అయినా ఆ కొత్త కోణాన్ని తెర‌పై చూపిస్తారో లేదో తెలీదు కానీ.. మ‌హాత్మ గాంధీ జీవిత‌క‌థ‌ను తెర‌పైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నం సాగుతోంది. అది కూడా మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని.. వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా సినిమా తీస్తున్నామ‌ని చెబుతున్నారు మేక‌ర్స్. `సత్యమేవ జయతే-1948` పేరుతో ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గాడ్సే గురించి సంచ‌ల‌న వ్యాఖ్య చేసి ఇరుకున ప‌డ్డ ఈ స‌మ‌యంలో ఈ బ‌యోపిక్ హాట్ టాపిక్ గా మారింది.

అన్ని భారతీయ-అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లోని లీ పాలస్ లో ప్రారంభమైంది. ఆలేఖ్య - రఘునందన్(గాంధీ) - ఆర్యవర్ధన్ రాజు(గాడ్సే) - నాగినీడు(ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) - జెన్నీ (మొహ్మద్ ఆలీ జిన్నా) - సమ్మెట గాంధీ(అబ్దుల్ గఫార్ ఖాన్) - ఇంతియాజ్ (నెహ్రు) శరద్ దద్భావాలా(సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్) - పి.శ్రీనివాస్ - (అబుల్ కలాం ఆజాద్) - తదితరులు న‌టిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. శరద్ దద్భావాలా క్లాప్ కొట్టారు. నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు.

``మ‌హాత్ముని జీవితంపై బోలెడంత ప‌రిశోధించాం. 11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్.. 350కి పైగా పుస్తకాలు.. 750కి పై చిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించాం. 96 క్యారెక్టర్లు-114 సీన్స్- 500కి పైగా ప్రాపర్టీస్- 370కి పైగా కాస్ట్యూమ్స్ సేక‌రించాం. 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు .. కీల‌క పాత్ర‌ధారులత‌ 47 లొకేషన్స్ లో 9 షెడ్యూల్స్ లో ఈ సినిమాని తెర‌కెక్కిస్తాం. అత్యున్న‌త‌ ప్రమాణాలతో.. జాతీయ- అంతర్జాతీయ భాషల్లో చిత్రీక‌రిస్తాం`` అని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ తెలిపారు.