Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: గేమ్ ఓవర్

By:  Tupaki Desk   |   14 Jun 2019 10:08 AM GMT
మూవీ రివ్యూ: గేమ్ ఓవర్
X
చిత్రం : గేమ్ ఓవర్

నటీనటులు - తాప్సీ - వినోదిని వైద్యనాధన్ - అనీష్ కురువిల్లా - సంచనా నటరాజన్ - రమ్య సుబ్రహ్మణ్యన్ - టి పార్వతి తదితరులు

సంగీతం - రాన్ ఎతాన్ యోహన్

ఛాయాగ్రహణం - ఎ వసంత్

ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్

సంభాషణలు : వెంకట్ కచర్ల

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అశ్విన్ శరవణన్

హారర్ చిత్రాల ట్రెండ్ ఈ మధ్య కాస్త తగ్గిన నేపథ్యంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఓవర్ మీద భారీ అంచనాలు లేకపోయినా ట్రైలర్ వచ్చాక ఆ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. అందులోనూ ఆ మధ్య ఆనందో బ్రహ్మ లాంటి సినిమాతో మెప్పించిన తాప్సీ ఇందులో కూడా ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిందన్న ఇంప్రెషన్ కలగడంతో చెప్పుకోదగ్గ పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే థియేటర్లలోకి అడుగు పెట్టింది. మరి వాటిని అందుకునేలా గేమ్ ఓవర్ సాగిందా లేదా రివ్యూలో చూద్దాం

కథ:

హైదరాబాద్ శివార్లలో కోకాపేట గేటెడ్ కమ్యూనిటీలో చివరి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది స్వప్న(తాప్సీ ). వర్క్ ఫ్రం హోం కావడంతో ఆఫీస్ కు వెళ్ళే తతంగం ఉండదు. కేవలం కాలమ్మ(వినోదిని వైద్యనాధన్) అనే పనిమనిషి మాత్రమే తోడుగా ఉంటుంది. ఏడాది క్రితం డిసెంబర్ 31 జరిగిన కొన్ని అనూహ్య సంఘటనల వల్ల చీకటి అంటే విపరీతమైన భయం ఏర్పరుచుకున్న స్వప్న చేతికి ఉన్న టాటూ వల్ల బయటికి కనిపించని శారీరక హింసను అనుభవిస్తూ ఉంటుంది. డాక్టర్లను కలిసినా ప్రయోజనం ఉండదు. ఓ సందర్భంలో టాటూకి గతంలో అదే తేదికి చనిపోయిన అమృత(సంచన నటరాజన్)కు కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ క్రమంలో నగరంలో అతి కిరాతకంగా హత్య చేయబడిన అమ్మాయిల ఉదంతాలు చదివిన స్వప్నకు చివరికి అలాంటి ప్రమాదమే వచ్చి పడుతుంది. ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అదేంటి అనేదే గేమ్ ఓవర్

కథనం - విశ్లేషణ:

హారరైనా కామెడీ అయినా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తే చాలు ఏ దర్శకుడైనా సక్సెస్ అయినట్టే. గేమ్ ఓవర్ ఇదే సూత్రాన్ని నమ్ముకుని నడుస్తుంది. మొదట్లో ఓ క్రైమ్ స్టొరీ అనే ఫీలింగ్ కలిగించి ఆ తర్వాత హారర్ ఎలిమెంట్స్ ని జొప్పించి తెలివిగా చూసేవాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేస్తూ దర్శకుడు అశ్విన్ శరవణన్ మంచి గేమ్ ఆడాడు. కథలో పాయింట్ కొత్తదే. అందులో అనుమానం లేదు. ఒంటరిగా ఉండే ఓ అమ్మాయి ఎమోషన్స్ ని భయాలను బేస్ చేసుకుని దాని చుట్టూ హారర్ ప్లస్ క్రైమ్ ని మిళితం చేయాలనుకున్న తీరు బాగుంది. స్క్రీన్ ప్లే అల్లుకున్న పద్ధతి బాగా కుదిరింది. కాకపోతే కథను చెప్పే క్రమంలో విడివిడిగా ఎపిసోడ్స్ ని బాగా రాసుకున్న అశ్విన్ వాటిని లింక్ చేయడంతో కొంత తడబాటుకు గురి కావడంతో ఫస్ట్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది

కథలో కీలక భాగం అమృత చావుకు సంబంధించినది. దానిని తాప్సీ చేతి మీద లింక్ అప్ చేయడం అనే పాయింట్ తో గొప్ప థ్రిల్ సృష్టించారు. అయితే సెకండ్ హాఫ్ టెంపోని బాగా మైంటైన్ చేసిన దర్శకుడు సామాన్య ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా క్లైమాక్స్ లో దానికి క్లారిటీ ఇవ్వడం మిస్ చేయడంతో గేమ్ ఓవర్ కొంత అసంతృప్తి కలిగిస్తుంది. అది మినహాయిస్తే ముగ్గురు దుండగులను పనిమనిషి సహాయతో కాళ్ళు విరగొట్టుకున్న హీరోయిన్ ఎదురుకోవడం లాంటి ఎపిసోడ్స్ బాగా పేలాయి. పదే పదే ఓ ఊహను నిజమని భ్రమించేలా చూపించి తీరా నిజాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన సమయానికి అదీ అబద్దమేమో అని అనుమానం కలిగించేలా చేయడం దర్శకుడి తెలివే. ఇక్కడ అతని ప్రతిభను మెచ్చుకుని తీరాలి.

ఇది పూర్తిగా ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందలేదు అని చెప్పడానికి లేదు. దర్శకుడు అశ్విన్ హాలీవుడ్ సినిమాల నుంచి ప్రభావితం చెందే కథను రాసుకున్నాడు. ప్రేక్షకుడి దృష్టిని తాప్సీ నుంచి పక్కకు మళ్ళించకుండా అతను తీసుకున్న జాగ్రత్త చాలా మటుకు లోపాలను కాపాడాయి. ఇంటర్వెల్ టైం లో మరీ ఉత్కంటభరితంగా అనిపించకపోయినా సెకండ్ హాఫ్ లో ఒక్కో మూమెంట్ గడిచే కొద్ది ఎగ్జైట్ మెంట్ ని పీక్స్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. కాని సీరియల్ మర్డర్స్ ఎందుకు జరిగాయో వాటి వెనుక కిల్లర్ల మోటివ్ ఏంటి అనే ప్రశ్నలకు మాత్రం పూర్తిగా సమాధానం ఇవ్వలేదు అశ్విన్. అవన్నీ సినిమా పూర్తయ్యాక సశేషంగా మనసులో మెదులుతూ ఉండగానే బయటికి వచ్చేస్తాం. టాటూలో అమృత ఆత్మ ఉన్నప్పుడు స్వప్నను అంత హింస పెట్టాల్సిన అవసరం ఎందుకో అర్థం కాదు

వాస్తవానికి కథను అన్ ఫోల్డ్ చేసే క్రమంలో ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఎక్కడికక్కడ దర్శకుడు చాలా క్లూస్ ఇస్తూ వెళ్ళాడు. స్వప్న వీడియో గేమ్ ల పిచ్చితో మొదలుకుని అమ్మ నాన్న ఇష్టానికి వ్యతిరేకంగా డిసెంబర్ 31 చేయకూడని పని ఏదో చేసినట్టు ఆడియో క్లిప్ ద్వారా వినిపించడం దాకా ఎన్నో ఉన్నాయి. కాని ప్రేక్షకుడికి ఇవన్ని చాలా లోతుగా ఆలోచిస్తేనే అర్థమవుతాయి. సినిమా చూస్తునప్పుడు మరీ మెదడుకు ఎక్కువ పని చెప్పడం ప్రతి సారి వర్క్ అవుట్ కాదు. నిడివి కేవలం గంట నలభై నిమిషాల లోపే ఉండటం గేమ్ ఓవర్ కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ సాగతీతకు అశ్విన్ దే బాధ్యత. లేదా ఇంకొంచెం లెంత్ పెంచి పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా అసంపూర్ణంగా ఉందే అనే ఫీలింగ్ కలగదు.

నటీనటులు:

ఇది తాప్సీ వన్ విమెన్ షో. హీరో లేడు. పాటలు అసలే పెట్టలేదు. హీరో ఊసు ఎక్కడా వినిపించదు. గ్లామర్ షోకు ఛాన్స్ లేదు. ఇన్ని పరిమితుల మధ్య తన మీదే పడ్డ మొత్తం భారాన్ని తాప్సీ అద్భుతంగా మోసింది. ఒకరకంగా చెప్పాలంటే పింక్ తర్వాత ఈ గేమ్ ఓవర్ పెర్ఫార్మన్స్ పరంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా టాటూ ఇబ్బంది పెడుతున్న సన్నివేశాల్లో కళ్ళ ముందే హంతకులు ప్రాణాలు తీయబోతున్నారని తెలిసినప్పుడు వచ్చే సీన్స్ లో తాప్సీ ది బెస్ట్ ఇచ్చేసింది. కొన్ని బోర్ కొట్టే సన్నివేశాల్లో సైతం క్రెడిట్ వచ్చిందంటే అది తాప్సీ వల్లే.

ఇక తనతో పాటు సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్న పనిమనిషిగా నటించిన వినోదిని కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనుక్షణం స్వప్న బాగోగుల కోసం తపన పడుతూ ఆఖరికి ప్రాణాలకు తెగించి దుండగులను ఎదురుకునే ఎపిసోడ్స్ లో చెలరేగిపోయింది. చాలా చిన్న పాత్రలలో ఎక్కువగా కనిపించే వినోదినికి సైతం ఇలాంటి పాత్ర అరుదుగా దొరుకుతుంది. అనీష్ కురువిల్లా ఉండేది రెండు మూడు సీన్లే అయినా గుర్తుండిపోతారు. ఫ్లాష్ బ్యాక్ లో పేషేంట్ గా నటించిన సంచన నటరాజన్ తనదైన ముద్రవేసింది

సాంకేతిక వర్గం:

దర్శకుడు అశ్విన్ శరవణన్ మరోసారి తనలో కమాండింగ్ స్టోరీ టెల్లర్ ని గేమ్ ఓవర్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. స్లో నెరేషన్ ఉన్నప్పటికీ ఫైనల్ గా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళను సంతృప్తి పరచడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. పజిల్స్ లాంటి కొన్ని లాజిక్స్ ని ప్రేక్షకులనే ఆలోచించుకోమని వదిలేయకుండా ఇంకాస్త క్లియర్ గా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుని ఉంటే ఏ ఫిలిం బై అరవింద్ తరహాలో అధిక శాతం వర్గాల ఆడియన్స్ ని మెప్పించే సినిమాగా మిగిలిపోయేది.

అయినా కూడా గేమ్ ఓవర్ అటెంప్ట్ పరంగా ఫెయిల్యూర్ అనిపించుకోదు కాబట్టి ఓ సారి ట్రై చేసే బాపతులోకి వస్తుంది. వసంత్ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అవుట్ డోర్ లో బ్యూటీ పార్లర్ ఓ కాఫీ షాప్ తప్ప మిగిలిన సినిమా మొత్తం ఒకే ఇంట్లో నడుస్తున్నా ఆ మొనాటనీ ఫీలింగ్ రాకుండా సెట్ చేసుకున్న ఫ్రేమింగ్ గేమ్ ఓవర్ ని ఇంకో లెవల్ కి తీసుకెళ్లింది. మాములు ఇంటీరియర్స్ ఉన్న హీరోయిన్ ఫ్లాట్ లో విసుగు రాకుండా సినిమా నడవాలి అంటే కెమెరా మెన్ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని వసంత్ సమర్ధవంతంగా నిర్వర్తించాడు.

ఇక దీనికి మరో బ్యాక్ బోన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రాన్ ఏతన్ యోహాన్. సింపుల్ గా చెప్పాలంటే అదరగొట్టాడు. కొన్ని పేలవమైన సన్నివేశాలకు ప్రాణం పోసి ఇంటెన్సిటీ తగ్గకుండా చూసుకోవడంలో ఇతని మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. థీమ్ కు తగ్గట్టు మారుతున్న వేరియేషన్స్ ని ఎక్కడా డైవర్ట్ అవ్వనివ్వకుండా సింక్ చేసిన తీరు మెచ్చుకోదగినది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ గురించి ఎంచడానికి లేదు. నిడివి ఉండటమే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంత కన్నా కట్ చేస్తే సగటు లెన్త్ కన్నా కిందకు వెళ్ళిపోతుంది కనక ఫస్ట్ హాఫ్ లో ఫ్లాస్ ను పట్టించుకోలేదు కాబోలు. వెంకట్ కాచర్ల డైలాగ్స్ లో మరీ ప్రత్యేకత ఏమి లేదు. వైనాట్-రిలయన్స్ సంస్థలకు ఆర్థికంగా బరువు అనిపించే సబ్జెక్టు కాదు కాబట్టి రాజీ ప్రస్తావనే అవసరం లేకుండా పోయింది

గేమ్ ఓవర్ గురించి చివరిగా చెప్పాలంటే థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్లకు నచ్చేలా ఇలాంటివి ఓ సారి ట్రై చేసి చూద్దాం అనుకునే సగటు ప్రేక్షకులకు కొంత అయోమయం కూడిన ఫీలింగ్ తో పర్వాలేదు అనిపించేలా సాగింది. ఇలాంటి ప్రయత్నాలు సాధారణంగా హాలీవుడ్ లోనే చూసే మనకు ఇక్కడా అశ్విన్ లాంటి దర్శకులు ప్రయత్నించి వాటిలో లోకల్ ఫ్లేవర్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తున్న తీరు ఎంతైనా అభినందనీయం. మరీ ఎక్కువ ఆశించకుండా ఎక్కడికక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోకుండా థ్రిల్స్ ని ఎంజాయ్ చేస్తూ పోతే గేమ్ ఓవర్ డీసెంట్ ఎంటర్ టైనరే

గేమ్ ఓవర్ - డీసెంట్ థ్రిల్లర్

రేటింగ్ : 3/5


isclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre