మేం విశాల్ ఆఫీసులో తనిఖీలు చేయలేదు

Tue Oct 24 2017 11:46:38 GMT+0530 (IST)

మంది మది దోచుకున్న మోడీ సర్కారు తీరు ఈ మధ్యన విమర్శల మీద విమర్శలకు గురి అవుతోంది. తమ పాలనను తప్పు పట్టే వారి మీద తనిఖీల అస్త్రాన్ని సంధిస్తోందన్న ఆరోపణ అంతకంతకూ పెరుగుతోంది. జీఎస్టీ బాదుడుపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ తీసిన తాజా సంచలనం మెర్సల్ చిత్రానికి మద్దతు పలికిన తమిళ నటుడు విశాల్ ఇంటిపైనా.. ఆఫీసుల్లోనూ జీఎస్టీ అధికారులు తనిఖీలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.తనిఖీలతో పాటు.. తమను వ్యతిరేకించిన వారిపై తనిఖీలతో భయభ్రాంతులకు మోడీ సర్కారు గురి చేస్తుందంటూ కొందరు తమ తీర్పును కూడా చెప్పేశారు. మెర్సల్ చిత్రానికి మద్దతుగా విశాల్ మాట్లాడినందుకే అతనిపై తనిఖీలకు గురి చేస్తున్నట్లుగా మీడియాలో ప్రముఖంగా వచ్చింది.

అంతేకాదు.. విశాల్ ఆఫీసులోనూ.. అతడి సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారని పేర్కొనటమే కాదు.. ఆ అధికారుల పేర్లను సైతం బయటకు చెప్పారు. తనిఖీల నేపథ్యంలో నటుడు.. నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు కరుణాస్ తో పాటు తాను ప్రతి పైసా పన్ను చెల్లించినట్లుగా విశాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అటు వీడియా.. ఇటు విశాల్ అండ్ కో తనిఖీలు జరిగినట్లుగా చెబుతుంటే.. మరోవైపు జీఎస్టీ అధికారులు మాత్రం తూచ్.. అలాంటిదేమీ లేదు.. తనిఖీలు అన్నవి నిజం ఎంతమాత్రం కాదని చెప్పటంతో.. ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. నటుడు విశాల్ పై తనిఖీలు నిజమా?   కాదా? అన్నది తేలేదెట్లా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.