Begin typing your search above and press return to search.

మ‌హేశ్‌ కు వాత పెట్టి భ‌లేగా వెన్న రాశారుగా!

By:  Tupaki Desk   |   23 Feb 2019 4:27 AM GMT
మ‌హేశ్‌ కు  వాత పెట్టి భ‌లేగా వెన్న రాశారుగా!
X
మాంచి వేడిగా ఉన్న అట్ల‌కాడ‌తో చ‌ర్మం ఊడిపోయేలా వాత పెట్టి.. అయ్య‌య్యో ఎంత ప‌ని జ‌రిగిదంటూ వెన్న రాసే బ్యాచ్ ఉంటుంద‌ని మాట‌ల్లో విన‌ట‌మే త‌ప్పించి చూసింది లేదు. ప్ర‌ముఖులుగా వ్య‌వ‌హ‌రించే వారు అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. అప్ప‌టివ‌ర‌కూ సంపాదించిన పేరు ప్ర‌ఖ్యాతులు గాల్లో క‌లిసిపోవ‌టం అంటే ఏమిటో సోష‌ల్ మీడియా వ‌చ్చాక అంద‌రికి అర్థ‌మ‌వుతోంది.

గ‌డిచిన ప‌దేళ్లుగా ప‌ర‌స్ప‌ర గౌర‌వ మ‌ర్యాద‌లు మంట‌గ‌లిసిపోయిన ప‌రిస్థితి. ఇక‌.. సోష‌ల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక‌.. దానికి జియో తోడ‌య్యాక.. ఇప్పుడు ఎవ‌రినీ ఎవ‌రూ ఆప‌లేని ప‌రిస్థితి. ఎవ‌రికి వారు.. త‌మ‌కు తోచిన‌ట్లుగా తీర్పులు ఇచ్చేస్తూ.. ర‌చ్చ ర‌చ్చ చేసేస్తున్నారు. ఇలాంటి వేళ‌.. ప్ర‌ముఖులు అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిందే. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా జ‌రిగే డ్యామేజ్ మామూలుగా ఉండ‌దు.

దీనికి నిలువెత్త ఉదాహ‌ర‌ణ‌గా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకు ఎదురైన ఇబ్బందిక‌ర అనుభ‌వాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిందే. ఈ మ‌ధ్య‌నే హైద‌రాబాద్‌ లో కెల్లా య‌మా రిచ్ గా ఉండే మ‌ల్టీఫ్లెక్స్ ను గ‌చ్చిబౌలిలో ఏర్పాటు చేయ‌టం.. దీనికి ఏఎంబీ మాల్ పేరు పెట్ట‌టం తెలిసిందే. దీని య‌జ‌మానికి మ‌రెవ‌రో కాదు.. మ‌హేశ్ బాబే. సినిమాలు.. ఇల్లు.. పెళ్లాం.. పిల్ల‌లు.. మ‌ధ్య మ‌ధ్య‌లో యాడ్స్ చేసుకుంటూ వెళ్లే మ‌హేశ్ అందుకు భిన్నంగా భారీ ఎత్తున మ‌ల్టీఫ్లెక్స్ క‌ట్ట‌టంతో ఒక్క‌సారిగా ఆయ‌న పేరు మారుమోగింది.

సినిమాల‌కు మించిన మ‌రే విష‌యంలోనూ క‌నిపించ‌ని మ‌హేశ్ పేరు తొలిసారిగా ప‌న్ను ఎగ్గొట్టార‌న్న ఆరోప‌ణ మీద రాగా.. ఇటీవ‌ల జీఎస్టీ చెల్లించే విష‌యంలో త‌ప్పు చేసిన‌ట్లుగా గుర్తించారు.వెను వెంట‌నే నోటీసులు జారీ చేశారు. అక్క‌డితో విష‌యం ఆగితే మ‌రోలా ఉండేది. కానీ.. అందుకు భిన్నంగా కొన్ని మీడియా సంస్థ‌లు ఈ విష‌యాన్ని ప్ర‌ముఖంగా అచ్చేయ‌టం.. ఇక వెబ్ సైట్ల‌లో అయితే విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ల‌క్ష‌లాది రూపాయిలు వ‌సూలు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ విష‌యాలన్ని మీడియాలో రావ‌టం.. ర‌చ్చ‌జ‌రిగిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ విష‌యంపై పెద్ద ఎత్తున సాగుతున్న హ‌డావుడికి చెక్ పెట్టేలా మ‌హేవ్ బృందం రంగంలోకి దిగింది. జీఎస్టీ విష‌యంలో జ‌రిగిన పొర‌పాటును గుర్తించ‌ట‌మే కాదు.. అధికారులు ఇచ్చిన నోటీసుల‌కు రియాక్ట్ అయి.. చెల్లించాల్సిన మొత్తాన్ని పే చేసేశారు.

ఇదిలా ఉంటే.. జీఎస్టీ లెక్క తేడా విష‌యం మీడియాలో ర‌చ్చ ర‌చ్చ సాగ‌టం.. దీనికి రియాక్ట్ అయిన మ‌హేశ్ తాను చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన వైనాన్ని అధికారుల చేత చెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. అదే స‌మ‌యంలో జీఎస్టీ చెల్లింపుల‌పై మ‌హేశ్ ప్ర‌ద‌ర్శించిన శ్ర‌ద్ద‌కు అధికారులు ఫిదా అయ్యారు. వెంట‌నే ఆయ‌న్ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతూ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

ఏఎంబీ మ‌ల్టీఫ్లెక్స్ లో ప్రేక్ష‌కుల నుంచి అద‌నంగా వ‌సూలు చేసిన రూ.35.66 ల‌క్ష‌ల మొత్తాన్ని వినియోగ‌దారుల సంక్షేమ నిధికి పే చేసిన విష‌యాన్ని జీఎస్టీ అధికారులు పేర్కొంటూ మ‌హేశ్ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఏఎంబీ సినిమాస్ య‌జ‌మానులైన మ‌హేశ్‌.. సునీల్ నారంగ్ లు త‌మ‌ది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించేందుకు ముందుకువ‌చ్చార‌ని.. ఇది ప్ర‌శంసించాల్సిన అంశంగా అధికారులు పేర్కొన్నారు.

మ‌హేశ్ త‌ర‌ఫు వారు క‌ట్టిన మొత్తాన్ని వినియోగ‌దారుల సంక్షేమ నిధికి క‌లిపిన‌ట్లుగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎవ‌రైనా స‌రే.. ఇలా బాధ్య‌త‌గా జీఎస్టీ వెన‌క్కి తిరిగి ఇవ్వ‌లేద‌ని.. మ‌హేశ్ బాబు.. సునీల్ నారంగ్ లు మాత్ర‌మే ఆద‌ర్శంగా నిలిచిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వాత పెట్టి మ‌రీ వెన్న రాసిన‌ట్లుగా జీఎస్టీ అధికారుల తీరు ఉంద‌న్న మాట వినిపిస్తోంది. గుట్టు చ‌ప్పుడు కాకుండా నోటీసులు జారీ చేసి..క‌ట్టాల్సిన మొత్తాన్ని క‌ట్టేసిన త‌ర్వాత ఇప్పుడు ఇంత‌లా పొగిడేయ‌టమా అంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.