Begin typing your search above and press return to search.

ఏఎంబీకి నోటీసులా? అధికారుల‌కే షాక్‌!!

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:24 AM GMT
ఏఎంబీకి నోటీసులా? అధికారుల‌కే షాక్‌!!
X
గ‌చ్చిబౌళిలోని ఏఎంబీ మాల్ కి జీఎస్టీ క‌మిష‌న‌రేట్ నోటీసులు పంపించిందంటూ ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్- సునీల్ నారంగ్ సంయుక్త భాగ‌స్వామ్యంలో నిర్మించిన ఈ మాల్‌లో థియేట‌ర్ల‌కు నోటీసులు అందాయ‌ని, జీఎస్టీ త‌గ్గినా.. ఆ త‌గ్గింపు ధ‌ర‌ల్ని టిక్కెట్టుపై త‌గ్గించ‌కుండా ప్రేక్ష‌కుల్ని మోసం చేస్తున్నార‌ని ప్ర‌చారం హోరెత్తిపోయింది. ఆ మేర‌కు మ‌హేష్ కు నోటీసులు అందాయ‌న్న ప్ర‌చారం వేడెక్కించింది.

అయితే ఇది నిజ‌మా? అంటే .. అలాంటిదేమీ లేద‌ని తాజాగా ఏషియ‌న్ సునీల్ నారంగ్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఏఎంబీకి ఏ నోటీసులు రాలేదు. నోటీసులు ఇచ్చార‌న్న వార్త‌లతో జీఎస్టీ అధికారులే షాక్ తిన్నార‌ని ఆయ‌న అన్నారు. అయితే ఏఎంబీ మాల్ లో విధానం ఎలా ఉందో చెక్ చేసేందుకు జీఎస్టీ అధికారులు విచ్చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. త‌మ‌ను పెనాల్టీ క‌ట్ట‌మ‌ని ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లు అని ఖండించారు నారంగ్. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తాము ఏదీ చేయ‌లేద‌ని .. ఒక‌వేళ ఎప్పుడైనా నోటీసులు వ‌చ్చినా తాము అందుకు స్పందించి స‌వ్యంగా చెల్లింపులు చేస్తామ‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. త్వ‌ర‌లో ఈ విష‌య‌మై అధికారుల్ని క‌లిసేందుకు వెళుతున్నామ‌ని వెల్ల‌డించారు.

నారంగ్ చెప్పిన దానిని బ‌ట్టి ఏఎంబీ మాల్ లో సినిమా టిక్కెట్ల విక్ర‌యాల విష‌యంలో ఎలాంటి గోల్ మాల్ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది అధికారులు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లో ధృవీక‌రించాల్సి ఉంటుంది. జీఎస్టీ త‌గ్గినా అధిక ధ‌ర‌ల‌కు టిక్కెట్లు అమ్మార‌ని, అందుకు ప్రూఫ్‌లు జీఎస్టీ అధికారులు సేక‌రించార‌ని వార్త‌లొచ్చాయి. మ‌రి ప్రూఫ్ ఉంది అని అధికారులు అన్నారు కాబ‌ట్టి.. అది త‌ప్పుడు ప్ర‌చారం అని ఏఎంబీ క‌ర్త‌లు నిరూపించాల్సి ఉంటుంది. ఇక మాల్స్ లో పార్కింగ్ ఫీజు నిషేధంపై ప‌లువురు మాల్ య‌జ‌మానులు మార్చి లో బంద్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపైనా నారంగ్ వివ‌ర‌ణ ఇస్తారేమో చూడాలి.