Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం బాటలో బాహుబలి-2

By:  Tupaki Desk   |   20 April 2017 1:22 PM GMT
బ్రహ్మోత్సవం బాటలో బాహుబలి-2
X
థియేటర్లలో రోజుకు నాలుగు షోలకు మించి ప్రదర్శించకూడదన్నది నిబంధన. ఐతే షోల సంఖ్యను ఐదుకు పెంచాలన్న ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది కూడా. ఐతే ఆ నిబంధన ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. గత ఏడాది ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. తెలంగాణ అధికారులతో మాట్లాడి.. తొలి రోజు వరకు ఈ చిత్రాన్ని రోజుకు ఐదు షోలు నడిపించేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఐతే దాని వల్ల ఆ సినిమాకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. రెగ్యులర్‌ మార్నింగ్ షో పడే సమయానికే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయి సినిమాకు ప్రతికూలంగా మారింది.

‘బ్రహ్మోత్సవం’ వల్ల ఐదో షో అనేది నెగెటివ్ సెంటిమెంటుగా మారింది. దీంతో ఆ తర్వాత ఎవరూ ఈ సౌలభ్యం కోరుకోలేదు. ఐతే ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఐదో షోను ఉపయోగించుకునే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదో షో ప్రదర్శించేందుకు పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుమతి దొరికితే ‘బాహుబలి’ టీం పంట పండినట్లే. ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెట్టిన బయ్యర్లలోనూ టెన్షన్ తగ్గుతుంది. ఈ సినిమాకున్న డిమాండ్ దృష్ట్యా వారం రోజుల పాటు ఐదు షోలు నడిపించినా ఆక్యుపెన్సీకి ఇబ్బందేమీ ఉండదు. మామూలుగానే కలెక్షన్ల రికార్డులన్నీ ‘బాహుబలి-2’ తుడిచిపెట్టేయడం ఖాయం. ఇక ఐదో షోకు అనుమతి దక్కాలే కానీ. అప్పుడు కలెక్షన్ల ఫిగర్స్ ఊహించిన స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/