Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్.. ఓ కొలిక్కి వచ్చినట్లే

By:  Tupaki Desk   |   15 Oct 2018 11:52 AM GMT
ఆర్ఆర్ఆర్.. ఓ కొలిక్కి వచ్చినట్లే
X
రాజమౌళి సినిమా అంటే అదో పెద్ద క్రతువు. కథ ఓకే కావడానికి.. స్క్రిప్టు తయారు కావడానికి.. నెలలు సంవత్సరాలు పడుతుంది. అస్సలు రాజీ పడని రాజమౌళి తత్వం వల్ల ప్రి ప్రొడక్షన్ దశలోనే చాలా కాలం గడిచిపోతుంది. ‘బాహుబలి’ రెండు భాగాల కోసం ఐదారేళ్ల సమయం వెచ్చించిన జక్కన్న.. పోయినేడాది ఏప్రిల్ 28న రిలీవ్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రమోషన్లలో.. తర్వాత వెకేషన్లో గడిపాడు. గత ఏడాది ద్వితీయార్ధం నుంచి తన తర్వాతి సినిమా కోసం సన్నాహాల్లో ఉన్నాడు. తన కొత్త సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లను హీరోలుగా ప్రకటించి కూడా ఏడాది అయిపోయింది. ఈ ఏడాది వేసవికే సినిమా మొదలవుతుందని మొదట్లో ప్రచారం జరిగింది. తర్వాత డెడ్ లైన్లు మారాయి. చివరికిప్పుడు అక్టోబరుకు వచ్చేశాం. ఇంకా సినిమా మొదలే కాలేదు.

ఐతే ‘ఆర్ఆర్ఆర్’గా పేర్కొంటున్న ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్ మీదికి వెళ్లడం పక్కా అని తెలుస్తోంది. రాజమౌళి ఎట్టకేలకు ఈ మధ్యే స్క్రిప్టును ఓకే చేశాడట. తాను అనుకున్న రీతిలో స్క్రిప్టు రావడంతో ఆయన గో అహెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. సాయిమాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ కూడా మొదలు పెట్టేసినట్లు సమాచారం. ఆయనకు విజయేంద్ర ప్రసాద్ బృందం సాయం చేస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం సెట్టింగ్స్ దాదాపుగా పూర్తయ్యాయట. ప్రస్తుతం చిత్ర బృందానికి వర్క్ షాప్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి యూనిట్లోని వాళ్లకు చిన్న స్థాయి వర్క్ షాప్ పెట్టారట. త్వరలోనే కొంచెం పెద్ద స్థాయిలో వర్క్ షాప్ జరగబోతోంది. మరోవైపు కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే నెలలో లేదా.. డిసెంబర్లో సినిమా షూటింగ్ ఆరంభమవుతుందని తెలుస్తోంది.