Begin typing your search above and press return to search.

మీ బ్రాండ్ ఏది రాజుగారు ?

By:  Tupaki Desk   |   18 Oct 2018 2:30 PM GMT
మీ బ్రాండ్ ఏది రాజుగారు ?
X
ఒకప్పుడు దిల్ రాజు సినిమా అంటే ఫ్యామిలీస్ కే కాదు యూత్ కు సైతం నిరాశపడమనే గ్యారెంటీ ఉండేది. బొమ్మరిల్లు-ఆర్య-పరుగు-కొత్త బంగారు లోకం ఇలా ఒకటా రెండా ఆయన బ్యానర్ లోగోనే నమ్మకానికి మారు పేరుగా నిలిచింది. కానీ అదంతా గతం. కమర్షియల్ లెక్కల్లో పడిపోయి దిల్ రాజు అందరి దారిలో ప్రయాణించే ప్రయత్నం చేయడం ఆయన ప్రత్యేకతను తగ్గిస్తోంది. గత రెండు మూడేళ్లుగా దిల్ రాజు తీస్తున్న సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. యునానిమస్ గా బాగున్నాయి అనే టాక్ వచ్చే సినిమా శతమానం భవతి తర్వాత మళ్ళి రాలేదు.

రామయ్య వస్తావయ్యాతో మొదలుపెట్టి డీజే దాకా చూసుకుంటే స్టార్ హీరోల ఇమేజ్ బందిఖానాలోకి రాజుగారే వెళ్ళిపోయి చేసినవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నేను లోకల్ లాంటివి సక్సెస్ అనిపించుకున్నా ఆయన రేంజ్ సినిమా కాదని అభిమానులు సైతం ఒప్పుకుంటాడు ఇవాళ విడుదలైన హలో గురు ప్రేమ కోసమే చూసినా ఇదే అవగతమవుతుంది. ఫలితం గురించి కామెంట్ చేయడం తొందరపాటుతనమే అవుతుంది కానీ పబ్లిక్ టాక్ ప్లస్ రివ్యూస్ అన్ని కూడా ఇదేమంత గొప్పగా లేదనే ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో ఈ వీకెండ్ తర్వాత ఏ స్థాయిలో నిలబడుతుంది అనే దాన్ని బట్టే హిట్టా ఫట్టా తేలుతుంది.

ఈ ఏడాది వచ్చిన లవర్-శ్రీనివాస కళ్యాణం కూడా తీవ్రంగా నిరాశ పరిచిన నేపధ్యంలో దిల్ రాజులో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్ ఆయన మాటల్లోనే బయటపడింది. ఇకపై తాను కూడా లిప్ లాక్ కిస్సులు ఉన్న సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు చూస్తారేమో అని ఆయన చెప్పడం విని అందరు ఆశ్చర్యపోయారు. అలాంటివే ఆడుతున్నాయి అని చెప్పడం సబబుగా అనిపించలేదు. మరి దిల్ రాజు ఇవన్ని బేరీజు వేసుకుని పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని కోరుతున్నారు అభిమానులు.