Begin typing your search above and press return to search.

తిరిగి రాని లోకాల‌కు త్రివిక్ర‌మ్ స్ఫూర్తి

By:  Tupaki Desk   |   21 May 2018 6:19 AM GMT
తిరిగి రాని లోకాల‌కు త్రివిక్ర‌మ్ స్ఫూర్తి
X
ప్ర‌ముఖ న‌వ‌లా ర‌చ‌యిత్రి అంటే.. 1980కి ముందు పుట్టిన వారికి ఓకే కానీ.. ఆ త‌ర్వాత పుట్టిన వారైతే? ఎవ‌రంటూ కనుబొమ్మ‌లు ఎగుర‌వేస్తారు. మ‌ళ్లీ.. వారినే అ..ఆ.. సినిమా ఒరిజిన‌ల్ క‌థ రాసిన ర‌చ‌యిత్రి అంటే.. అవున‌వును విన్నామంటారు.అయితే.. ఈ ఇద్ద‌రూ ఒక్క‌రే. వారే.. ప్ర‌ముఖ న‌వ‌లా ర‌చ‌యిత్రి య‌ద్ద‌న‌పూడి సులోచనారాణి.

అర‌వై.. డెబ్భైల్లో సెల‌బ్రిటీలు ఎవ‌రంటే సినిమా వాళ్లు.. ర‌చ‌య‌త‌లు..క‌వులే ఉండేవారు. వారిలోనూ ప్ర‌ముఖులుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అందుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. ఆ రోజుల్లోనే ఒక మ‌హిళ న‌వ‌లా ర‌చ‌యిత్రిగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకోవ‌టం.. తాను రాసిన న‌వ‌ల‌ల్ని సినిమాలుగా వ‌రుస పెట్టి తీసేలా ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన న‌వ‌లా ర‌చ‌య‌త్రి య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణిగా చెప్పాలి. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కు స్ఫూర్తిగా.. హీరోయిన్ ను ఆవిష్క‌రించే తీరుతో పాటు..క‌థ‌ను చెప్పే అంశానికి సంబంధించి య‌ద్ద‌న‌పూడి త‌న స్ఫూర్తిగా త్రివిక్ర‌మ్ చెబుతుంటారు.

ఆ మ‌ధ్య‌న ఆయ‌న తీసిన అ ఆ సినిమా ఒరిజిన‌ల్ య‌ద్ద‌న‌పూడి రాసిన మీనా న‌వ‌ల‌లోనిది. ఆ పేరుతోనే గ‌తంలో ఒక సినిమా వ‌చ్చింది. ఆ సినిమాను య‌థాత‌ధంగా అ ఆ పేరుతో సినిమా తీశారు. బిగినింగ్ షాట్ మొద‌లు ఎండింగ్ షాట్ వ‌ర‌కూ మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని మార్పులు (కాలానికి త‌గ్గ‌ట్లు వ‌చ్చేవి) త‌ప్పించి.. ఆ సినిమానే తీశారు.

ఇంత చేసిన త్రివిక్ర‌మ్ క‌థ అన్న ద‌గ్గ‌ర‌య‌ద్ద‌న‌పూడి పేరు వేయ‌క‌పోవ‌టం.. ఇది కాస్త ర‌చ్చ కావ‌టం.. ఈ ఉదంతంపై య‌ద్ద‌న‌పూడి ఫీల్ కావ‌టం జ‌రిగింద‌ని చెబుతారు.

సాంకేతిక కార‌ణాల వ‌ల్ల పేరు వేయ‌లేక‌పోయామంటూ త్రివిక్ర‌మ్ స‌ర్ది చెప్పుకున్నారు. ఇక‌.. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తెలుగు న‌వ‌లా ప్ర‌పంచంలో య‌ద్ద‌న‌పూడి సులోచ‌న‌రాణిది కాస్త భిన్న‌మైన శైలి. ర‌చ‌య‌త‌గా ఆమెకున్న పేరు ప్ర‌ఖ్యాతుల‌కు భిన్నంగా ఆమె తీరు ఉండేది. మిగిలిన సాహితీవేత్త‌ల మాదిరి కాకుండా.. త‌న‌దైన ప్ర‌పంచంలో ఆమె ఉండేవారు. అందులోకి బ‌య‌ట‌వారిని రానిచ్చే వారు కాదు.

గ‌డిచిన కొంత‌కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె శ‌నివారం ఉద‌యం కాలిఫోర్నియా(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు చెబుతున్నారు. కుప‌ర్టినో ప‌ట్ట‌ణంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కృష్ణ జిల్లా మువ్వ మండ‌లంలోని కాజా గ్రామంలో పుట్టిన ఆమె.. హైద‌రాబాద్ లో సెటిల్ అయ్యారు.

హైద‌రాబాద్ అంద‌చందాల‌కు ముగ్దులైన ఆమె.. త‌ర‌చూ త‌న న‌వ‌ల‌లో హైద‌రాబాద్ ను క‌థావ‌స్తువుగా ఎంచుకునే వారు. ఆమె రాసిన న‌వ‌ల్లో కొన్నింటిని సినిమాలుగా తీశారు. కుటుంబ బంధాలు.. అనుబంధాలు.. ప్రేమ‌లు.. లాంటి సున్నిత‌మైన అంశాల్ని క‌థ‌వ‌స్తువుగా తీసుకొని న‌వ‌ల‌లు రాయ‌టంలో ఆమె దిట్ట‌.

ప్ర‌జ‌ల జీవ‌న విధానాల్లో వ‌చ్చే మార్పుల్ని త‌న‌దైన పాత్ర‌ల ద్వారా ఆమె చెప్పే ప్ర‌య‌త్నం చేసేవారు. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధం.. వారి మ‌ధ్య ప్రేమ‌లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిల వ్య‌క్తిత్వం.. ఆత్మ‌విశ్వాసం.. హుందాత‌నం.. మాట‌కారిత‌నం.. లాంటివి య‌ద్ద‌న‌పూడి వారి ర‌చ‌న‌ల్లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటాయి. ఆమె రాసిన న‌వ‌ల‌లు ఎన్నో ఫేమ‌స్‌. అర‌వై.. డెబ్బైల్లోని వారికి సుప‌రిచిత‌మైన య‌ద్ద‌న‌పూడి మ‌ర‌ణం.. తెలుగు న‌వ‌లా ప్ర‌పంచానికి తీర‌ని లోటుగా చెప్ప‌క త‌ప్ప‌దు.