సరిగ్గా తీయాలే కానీ ఆ బయోపిక్ పేలిపోతుంది

Tue May 22 2018 15:40:12 GMT+0530 (IST)

ఇండియన్ సినిమాలో కొన్నేళ్లుగా స్పోర్ట్స్ పర్సన్స్ బయోపిక్స్ కు మాంచి డిమాండ్ కనిపిస్తోంది. లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ జీవిత కథతో తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ ఈ తరహా సినిమాలకు మంచి ఊపునిచ్చింది. ఆ సినిమా అద్భుత విజయాన్నందుకుంది. ఆ తర్వాత ‘మేరీకోమ్’ కూడా పర్వాలేదనిపించింది. ఇక ధోని సినిమా ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీని తర్వాత వచ్చిన సచిన్ బయోపిక్ ‘ఎ బిలియన్ డ్రీమ్స్’ అంతగా ఆకట్టుకోలేదు. దాన్ని సినిమాలా కాకుండా డాక్యుమెంటరీలా రూపొందించడంతో అది ప్రేక్షకులకు రుచించలేదు. ఇప్పుడు మరో భారత క్రికెట్ లెజెండ్ సౌరభ్ గంగూలీ కథతో ‘దాదాగిరి’ అనే వెబ్ సిరీస్ రాబోతున్నట్లు రాబోతున్నట్లు వార్తలొచ్చాయి. మరి ఇదెలా ఉంటుంది.. ప్రేక్షకుల దృష్టిని ఏమేరకు ఆకర్షిస్తుందనే చర్చ మొదలైంది.నిజానికి దాదా కథతో సినిమా తీస్తే అదిరిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అతడి కెరీర్లో అలాంటి డ్రామా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లోకి సౌరభ్ ఆగమనమే ఒక సంచలనం. గంగూలీ ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతడిని భారత జట్టులోకి తొలిసారి ఎంపిక చేసినపుడు నేరుగా తుది జట్టులో చోటివ్వలేదు. ఎక్స్ ట్రా ప్లేయర్ గా ఉంచారు. మైదానంలోని ఆటగాళ్లకు అతడితో డ్రింక్స్ పంపించారు. దానికి అతను నొచ్చుకున్నాడు. తన అసంతృప్తిని చూపించాడు. ఇక ఆ తర్వాత తుది జట్టులో చోటివ్వగానే అద్భుతమైన సెంచరీ బాది తనేంటో చాటి చెప్పాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. వన్డే క్రికెట్లో అతడి ఆట గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఒక దశలో సచిన్ ను కూడా వెనక్కి నెట్టి తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్లాడు దాదా. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్ పతనమైపోయిన స్థితిలో ధైర్యంగా జట్టు పగ్గాలు చేపట్టి అతను తెచ్చిన విప్లవాత్మక మార్పు గురించి ఎంత చెప్పినా తక్కువే.

మళ్లీ భారత క్రికెట్‌ను పైకి లేపిన ఘనత అతడిదే. అప్పటిదాకా భయం భయంగా ఆడే భారత క్రికెట్ శైలిని అతను మార్చేశాడు. జట్టులో దూకుడు తెచ్చాడు. సెహ్వాగ్ యువరాజ్ హర్భజన్ లాంటి ఎందరో ప్రతిభావంతులైన కుర్రాళ్లను వెలుగులోకి తెచ్చింది అతడే. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్లలో టీమ్ ఇండియాను నిలబెట్టిన దాదా.. భారత క్రికెట్లో ఏ కెప్టెన్ సాగించని ఆధిపత్యాన్ని చూపించాడు. ఐతే తర్వాత తనే ఏరికోరి కోచ్‌గా తెచ్చుకున్న గ్రెగ్ ఛాపెల్ దెబ్బకు జట్టులోనే చోటు కోల్పోయి.. మళ్లీ పోరాటంతో టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసి తనేంటో రుజువు చేసుకుని సగర్వంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆపై ఐపీఎల్ లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఆట నుంచి రిటైరయ్యాక క్రికెట్ పాలనలో తనదైన ముద్ర వేశాడు. చాలా తక్కువ సమయంలో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. భవిష్యత్తులో అతను బీసీసీఐ అధ్యక్షుడు కూడా కావచ్చు. ఇలా దాదా కెరీర్లో ఎన్నో మలుపులున్నాయి. గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. డ్రామా తక్కువేమీ కాదు. కాబట్టి సౌరభ్ కథను సరిగ్గా తీస్తే అదిరిపోతుందనడంలో సందేహం లేదు.