దసరా బరిలో 100కోట్ల పందెం!!

Fri Oct 12 2018 18:08:51 GMT+0530 (IST)

విశాల్ - లింగుస్వామి కాంబినేషన్ అనగానే పందెంకోడి గుర్తుకొస్తుంది. పందెంకోడి (సందెకోజి) తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్. విశాల్ కి ఎదురేలేని కెరీర్ ని ఇచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. అందుకే మరోసారి ఆ ఇద్దరి కలయికలో సీక్వెల్ సినిమా తెరకెక్కుతోంది అనగానే ఒకటే ఉత్కంఠ. పందెం కోడి 2 చిత్రం దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ కలయికలో సాధ్యమైంది. యాథృచ్ఛికంగా ఈ సినిమా విశాల్ కెరీర్ 25వ సినిమాగా వస్తోంది.తెలుగు వెర్షన్ ని లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఎల్ ఎల్ పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్ - పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్ - దవళ్ జయంతిలాల్ గడా - అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. పందెంకోడి 2 ప్రీ రిలీజ్ వేడుకను అక్టోబర్ 14న హైదరాబాద్- జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు మునుపటితో పోలిస్తే భారీగా విశాల్ అభిమానులు ఎటెండ్ కానున్నారని తెలుస్తోంది. ఇదివరకూ రిలీజైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తోంది. ఒక జాతరలో ఏడు రోజుల పాటు జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రమని విశాల్ తెలిపాడు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసిన ఫ్రాంఛైజీ ఇది. ఇందులో వరుసగా 3 - 4 చిత్రాల్ని నిర్మిస్తామని విశాల్ ఇదివరకూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ - వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పందెంకోడి 2  భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగిస్తోందన్న మాటా వినిపిస్తోంది. ఇక తెలుగులోనూ పందెంకోడి ఇమేజ్ ఈ సినిమా బిజినెస్ కి కలిసి రానుంది. ఈ దసరా బరిలో విశాల్ 100 కోట్ల క్లబ్ పందెంలో గెలుస్తాడేమో చూడాలి.