కాలా టీజర్.. భయమేస్తోంది బాబోయ్

Wed Feb 21 2018 13:31:17 GMT+0530 (IST)

రెండేళ్ల కిందట సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కబాలి’ టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పా.రంజిత్ దర్శకత్వంలో రజినీ ఈ సినిమా మొదలుపెట్టినపుడు పెద్దగా అంచనాల్లేవు. సినిమా పూర్తవుతున్న దశలో కూడా దీనికి బజ్ రాలేదు. కానీ ఒక్కసారి ఆ సినిమా టీజర్ రాగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. జనాలు కబాలి జ్వరంతో ఊగిపోయారు. ఆ తర్వాత ట్రైలర్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. అంతగా ఆ టీజర్ జనాలకు కిక్కిచ్చింది. కానీ టీజర్ చూసి ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్తే బొమ్మ ఇంకోలా కనిపించింది. ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఐతే ‘కబాలి’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ రజినీ మళ్లీ పా.రంజిత్ తో సినిమా చేయడానికి అంగీకరించి ఆశ్చర్యపరిచాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘కాలా’ ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకో రెండు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఇక ప్రమోషన్ హడావుడి మొదలుపెట్టాలని చూస్తున్నాడు నిర్మాత ధనుష్. ముందుగా మార్చి 10న ‘కాలా’ టీజర్ లాంచ్ చేయనున్నారట. కానీ ఈసారి కూడా టీజర్ తో మ్యాజిక్ చేసి.. సినిమా విషయంలో రజినీ-రంజిత్ షాక్ ఇస్తారేమో అని అభిమానుల్లో కలవరం మొదలవుతోంది. ‘కాలా’ టీజర్ ‘కబాలి’లా ఉండి జనాలను వెర్రెత్తించకపోతేనే మంచిదన్న అభిప్రాయం సూపర్ స్టార్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇంతకుముందులా కేవలం టీజర్ మీద కంటే సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి జనరంజకంగా తీర్చిదిద్దితే మంచిదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ‘కాలా’ టీజర్ ఎలా ఉంటుందో ఏమో మార్చి 10న తెలుసుకుందాం.