ఆ ఆరుగురు పేర్లతో ఇండస్ట్రీ షేకేనట

Sun Jul 16 2017 15:51:31 GMT+0530 (IST)

డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్ని ఎంతగా కుదిపివేస్తుందో తెలిసిందే. డ్రగ్స్ దందాలో తొలి నిందితుడిగా.. కీలకమైన కెల్విన్‌ను గడిచిన రెండు రోజులుగా అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతను ఇచ్చిన ఆధారాలు.. సాక్ష్యాలతో పాటు.. అధికారుల వద్ద ఉన్న సమాచారంతో పలు స్కూళ్ల యాజమాన్యాలకు.. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు ఇవ్వటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా రెండో జాబితాను సిట్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విచారణలో కెల్విన్ చెప్పిన వివరాలతో సెకండ్ లిస్ట్ తయారు కానున్నట్లుగా చెబుతున్నారు. ఈ లిస్ట్ లో పలువురు రాజకీయ నేతల పిల్లలు.. హైప్రొఫైల్  పెద్దలకు సంబంధించిన వారితో పాటు ప్రముఖులు.. పేజ్ త్రీ సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.

ఇందులో ఆరుగురు పేర్లను ప్రస్తుతానికి ఫైనల్ చేశారని చెబుతున్నారు.ఆ ఆరు పేర్లు బయటకు వస్తే టాలీవుడ్ భారీ కుదుపునకు గురి కావటం ఖాయమని చెబుతున్నారు. కెల్విన్‌ను విచారించేందుకు కోర్టు ఇచ్చిన సమయం ఆదివారంతో ముగియనుండటంతో.. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టటానికి మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు చెబుతున్నారు. కెల్విన్ ను మరింతగా విచారించేందుకు కోర్టు కానీ సోమవారం అనుమతి ఇచ్చిన పక్షంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమని చెబుతున్నారు.

కెల్విన్ ఇచ్చిన సమచారాన్ని అన్నికోణాల్లో క్రాస్ చెక్ చేసుకున్నాకే ఆరుగురితో కూడిన రెండో లిస్ట్ తయారు చేశారని.. అది కానీ బయటకు వస్తే అదో పెను సంచలనంగా మారటం ఖాయమని తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రముఖ నిర్మాత మరి ముఖ్యంగా ఆరుగురు పేర్లలో ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు.. అతని సోదరుడు.. మరో ఫైట్ మాస్టర్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇండస్ట్రీకి కీలకమైన వ్యక్తులే నోటీసులు ఇవ్వాల్సిన జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఇదంతా ప్రచారంగానే మిగిలిపోతుందా? నిజంగానే అధికారులు వారికీ నోటీసులు ఇవ్వనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే డ్రగ్స్ సరఫరాకు సంబంధించి చెల్లింపులు ఏ విధంగా సాగేవి అన్న విషయం మీద అధికారులు దృష్టి పెట్టారు. టాలీవుడ్ ప్రముఖులు పలువురుఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అదే నిజమైన పక్షంలో.. చెల్లింపుల వివరాల్ని ఆధారాలుగా చూపించొచ్చని చెబుతున్నారు. చెల్లింపుల కోసం తాను ఎప్పుడూ కలవలేదని.. అదంతా ఆన్ లైన్లో జరిగిపోతుందని చెబుతున్నారు. దీంతో.. కెల్విన్ బ్యాంకు ఖాతాల్ని చెక్ చేయటంద్వారా.. అతగాడి కస్టమర్లు ఎవరన్నది గుర్తించే వీలుందని చెబుతున్నారు.